పాపం ఇమ్రాన్ ఖాన్.. జైల్లో మగ్గి మగ్గి చావాలా? ఆస్పత్రికి తరలించరా?
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
By: A.N.Kumar | 18 Aug 2026 9:00 PM ISTపాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు మూడేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. జైల్లో మగ్గి మగ్గి చస్తున్నా ప్రభుత్వం ఆయన్ను బయటకు తేవడం లేదు. మెరుగైన వైద్య చికిత్స అందించడం లేదు. ఎవరికీ చూపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు అధికారులను స్పష్టంగా ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి.
వైద్య నివేదికలను పరిశీలించిన సుప్రీంకోర్టు
ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించిన సమగ్ర వైద్య నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీర్ఘకాలిక జైలు జీవితం.. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా ఆయన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పిటిఐ నేతలు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలు నిబంధనలకు లోబడి తగిన సదుపాయాలు అందకపోవడం వల్లే ఆయన పరిస్థితి మరింత దిగజారిందని వారు పేర్కొంటున్నారు.
రాజకీయ ప్రేరేపిత కేసుల ఆరోపణలు
2023లో అరెస్టయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ పలు న్యాయపరమైన వివాదాలు, విచారణలను ఎదుర్కొంటున్నారు. అవినీతి, ప్రభుత్వ రహస్య పత్రాల దుర్వినియోగం, తోషాఖానా వ్యవహారం వంటి అనేక కేసులలో ఆయనపై శిక్షలు ఖరారయ్యాయి. అయితే తనపై నమోదైన ప్రతి కేసూ కేవలం రాజకీయ ప్రేరేపితమైనదని.. ప్రత్యర్థులు కుట్రపూరితంగానే తమను జైలులో ఉంచారని ఇమ్రాన్ ఖాన్, పిటిఐ శ్రేణులు మొదటి నుంచీ వాదిస్తున్నాయి.
కుటుంబ సభ్యులు, పిటిఐ శ్రేణుల ఆందోళన
జైలు పరిసరాల్లో ఇమ్రాన్‌కు తగిన నిపుణుల పర్యవేక్షణ, సకాలంలో వైద్యం అందడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు స్పందించి ఆస్పత్రికి తరలించాలని ఆదేశించడంతో పాకిస్థాన్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.
కోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు అత్యుత్తమ వైద్య చికిత్స అందుతుందా.. ఆస్పత్రిలో ప్రత్యేక రక్షణ మధ్య చికిత్స ఎలా సాగుతుంది అనే అంశాలపై అక్కడ ఉత్కంఠ నెలకొంది. ఈ నిర్ణయంతోనైనా ఇమ్రాన్ ఖాన్ కోలుకుంటారని పిటిఐ మద్దతుదారులు ఆశిస్తున్నారు.
