మరణ పుకార్ల మధ్య ఇమ్రాన్ ఖాన్ తాజా పరిస్థితి ఇదే(నా)!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 27 Nov 2025 11:11 AM ISTపాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించారనే విషయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. బలుచిస్థాన్ విదేశాంగ శాఖ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ... పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, ఐఎస్ఐ కలిసి ఆయన్ను హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని ఆ పోస్టులో రాసుకొచ్చింది.
దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో రావల్పిండిలో ఆయన ఉన్న జైలు ముందు పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు నిరసన చేపట్టారు. మరోవైపు ఇమ్రాన్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సోదరీమణులు డిమాండ్ చేశారు. ఈ సమయంలో పోలీసులు తమపై విచక్షణారహితంగా దాడులు జరిపారని ఇమ్రాన్ సోదరీమణులు ఆరోపించారు.
ఇంతగా ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు రిక్వస్ట్ చేసినా, డిమాండ్ చేసినా.. మాజీ ప్రధానిని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన మృతి వార్తలు మరింతగా ఊపందుకున్నాయి. అసీమ్ మునీర్ & కో కలిసి ఆయనను తుదముట్టించి ఉంటారంటూ చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ విషయం పాక్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది.
2022లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి అధికారం కోల్పోయినప్పటి నుంచీ ఇమ్రాన్ ఖాన్ ను అమానవీయ పరిస్థితుల్లో, ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఆయన సోదరీమణులు, ఆయన కుమారులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన ముగ్గురు సోదరీమణులు... కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆయనను కలవడానికి తమను అనుమతించలేదని తెలిపారు.
స్పందించిన జైలు అధికారులు!:
ఈ పరిణామాల నేపథ్యంలో జైలు అధికారులు స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా... అడియాలా జైలు నుంచి ఇమ్రాన్ ను తరలించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు రెగ్యులర్ గా వైద్య సహాయం అందుతుందని.. ఆయనకు మంచి భోజనం అందిస్తున్నామని.. ఆయన మృతి చెందారంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమైనదవి పేర్కొన్నారు.
పంజాబ్ పోలీస్ చీఫ్ కు ఖాన్ సోదరీమణుల లేఖ!:
ఈ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖాన్, నోరీన్ ఖా, డాక్టర్ ఉజ్మా ఖాన్.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులపై దారుణమైన దాడి, చట్టవిరుద్ధమైన నిర్బంధంపై పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వర్ కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అందించిన ఫిర్యాదు లేఖలో సంచలన ఆరోపణలు చేశారు.
ఇందులో భాగంగా... ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఉన్న ఆందోళనలపై తాము శాంతియుతంగానే నిరసన తెలిపామని.. తాము రోడ్లను దిగ్భందించలేదని.. ప్రజాలకు ఆటంకం కలిగించలేదని.. చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడలేదని అన్నారు. అయినప్పటికీ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఆ ప్రాంతంలోని వీధిలైట్లను అకస్మాత్తుగా ఆపేశారని.. ఉద్దేశ్యపూర్వకంగా అంధకారంలోకి నెట్టారని తెలిపారు.
ఆ తర్వాత పంజాబ్ పోలీసులు తమపై క్రూరమైన, ప్రణాళికాబద్దమైన దాడి చేశారని అన్నారు. ఈ సందర్భంగా... ఈ దారుణ దాడిలో పాల్గొన్న పోలీసులందరిపైనా పంజాబ్ ఐజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఖాన్ సోదరీమణులు డిమాండ్ చేశారు.
కాగా... ఇమ్రాన్ కుటుంబం ఆయనను వారానికి రెండుసార్లు జైలులో పరామర్శించే అనుమతిని ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ అనుమతులపై సుమారు నెల రోజులకు పైగా ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధించింది.
ఎవరీ ఇమ్రాన్ ఖాన్?:
ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజీ అలియాస్ ఇమ్రాన్ ఖాన్ 1952 అక్టోబర్ 5న లాహోర్ లో జన్మించారు. ఆక్స్ ఫర్డ్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. 1971లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో 1992లో పాకిస్థాన్ కు ప్రపంచ కప్ ను అందించాడు! 1996లో పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. 2018 ఆగస్టు నుంచి 2022 ఏప్రిల్ వరకూ పాకిస్థాన్ కు 19వ ప్రధానమంత్రిగా పనిచేశాడు.
