Begin typing your search above and press return to search.

జైల్లో ఇమ్రాన్ ఖాన్ మృతి..? భగ్గుమన్న పాకిస్తాన్.. ఆర్మీ కీలక ప్రకటన..

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కొంతకాలంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి.

By:  A.N.Kumar   |   12 Aug 2026 11:58 PM IST
జైల్లో ఇమ్రాన్ ఖాన్ మృతి..? భగ్గుమన్న పాకిస్తాన్.. ఆర్మీ కీలక ప్రకటన..
X

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మరణించారంటూ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పాకిస్తాన్ సైన్యం తెరదించింది. ఆ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని.. ఇమ్రాన్ ఖాన్ సజీవంగానే ఉన్నారని అధికారులు అధికారికంగా స్పష్టం చేశారు.

కలకలం రేపిన సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కొంతకాలంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మరణించి ఉండవచ్చని, ఆయనతో పాటు మరో ముగ్గురు సీనియర్ పాకిస్థాన్ సైనిక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు.

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, సైన్యం కలిసి ఇమ్రాన్‌ను బయట ప్రపంచానికి కనిపించకుండా దాచిపెడుతున్నారనే తీవ్ర ఆరోపణలు కూడా ఆయన చేశారు. అయితే ఈ సమాచారాన్ని తాను వ్యక్తిగతంగా ధ్రువీకరించలేదని.. కేవలం కొన్ని వర్గాల నుంచి అందిన సమాచారాన్ని మాత్రమే వెల్లడిస్తున్నానని వజాహత్ సయీద్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో పీటీఐ కార్యకర్తల్లో, మద్దతుదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

స్పందించిన ఆర్మీ.. రావల్పిండి జైల్లోనే ఇమ్రాన్

ఈ పుకార్లపై పాకిస్థాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్.పీఆర్) తక్షణమే స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. ఇమ్రాన్ ఖాన్ పూర్తి సురక్షితంగా, సజీవంగా ఉన్నారని.. రావల్పిండిలోని అడియాలా జైలులోనే ఖైదీగా ఉన్నారని వెల్లడించింది. దీంతో గందరగోళానికి ముగింపు పడింది.

పీటీఐ నేతల ఆందోళన

73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే జైలులో ఉన్న ఆయనను కలిసేందుకు తమకు, కుటుంబ సభ్యులకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని పీటీఐ నేతలు పలుమార్లు ఆరోపించారు. అంతేకాకుండా ఆయనకు సరైన వైద్య చికిత్స అందడం లేదని, ఆయన భద్రతపై అనుమానాలు ఉన్నాయని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అధికారులు క్లారిటీ ఇచ్చినప్పటికీ తమ నాయకుడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి పారదర్శకత వహించాలని, ప్రత్యక్షంగా కలిసే అవకాశం కల్పించాలని ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం పాక్ ఆర్మీ ప్రకటనతో సోషల్ మీడియా పుకార్లకు అడ్డుకట్ట పడినట్లయింది.