మరో 17 ఏళ్లు జైలు.. ఇమ్రాన్ ఖాన్ జీవితాన్ని అలా ప్లాన్ చేశారా..!
అవును... ఆగస్టు 2023 నుంచి జైల్లోనే మగ్గుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది.
By: Raja Ch | 20 Dec 2025 6:00 PM ISTపాకిస్థాన్ అనధికారిక నియంత, సర్వాధికారిగా రాజ్యమేలుతున్న అసీమ్ మునీర్ ఉన్నంతకాలం ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మగ్గుతూ ఉండే పరిస్థితులు తప్పవని.. అలాకానిపక్షంలో ఇమ్రాన్ దేశాన్ని వదిలి వెళ్లిపోవడానికి అంగీకరించాలని కథనాలొస్తున్న వేళ.. ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు ప్రత్యేక కోర్టు భారీ జైలు శిక్ష విధించింది.
అవును... ఆగస్టు 2023 నుంచి జైల్లోనే మగ్గుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా... తోషాఖానా-2 అవినీతి కేసులో పాకిస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీలకు చెరో 17 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇది పాక్ లో తాజా సంచలనం.
ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులో జరిగిన విచారణలో ప్రత్యేక న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును ప్రకటిస్తూ.. ఇమ్రాన్, బుష్రా బీబీలకు పాకిస్థాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద 10ఏళ్లు కఠిన కారాగార శిక్ష.. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ నిబంధనల కింద ఏడేళ్లు శిక్ష విధించబడిందని తెలిపారు.
ఇదే సమయంలో.. ఒక్కొక్కరికీ రూ.16.4 మిలియన్లు జరిమానా కూడా విధించారు. ఈ కోర్టు శిక్షలు విధిస్తున్నప్పుడు.. ఇమ్రాన్ ఖాన్ వృద్ధాప్యాన్ని, బుష్రా ఇమ్రాన్ ఒక మహిళ అనే వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుందని.. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకునే తక్కువశిక్ష విధించినట్లు తీర్పు కాపీ పేర్కొందని డాన్ మీడియా తెలిపింది.
ఈ తీర్పు అనంతరం స్పందించిన ఖాన్, బీబీల తరుపూ న్యాయవాది.. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.
కాగా... తోషాఖానా-2 కేసు ఖరీదైన బల్గారీ ఆభరణాల సెట్ కొనుగోలుతో ముడిపడి ఉంది. దీనిని సౌదీ యువరాజు 2021 మే లో అధికారిక పర్యటన సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ కు బహుమతిగా ఇచ్చారని చెబుతారు. అయితే.. రూ.80 మిలియన్ల విలువైన ఆ ఆభరణాల సెట్ ను ఇమ్రాన్ ఖాన్ కేవలం రూ.2.9 మిలియన్లు చెల్లించిన తర్వాత అట్టిపెట్టుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించినట్లు తెలుస్తోంది.
