Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారు కానీ... తెరపైకి సంచలన విషయం!

అవును... పాకిస్థాన్ లోని అడియాలా జైలులో ఆ దేశ మాజీ ప్రధాని చనిపోయారంటూ కథనాలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   30 Nov 2025 11:26 PM IST
ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారు కానీ... తెరపైకి సంచలన విషయం!
X

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ ఇటీవల కథనాలు రావడం, దీంతో జైలు ముందు పాకిస్థాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు, ఆయన ముగ్గురు సోదరీమణులు నిరసన తెలపడం.. తమను తమ సోదరుడిని ఒకసారి కలుసుకునే అవకాశం కల్పించాలని.. వాస్తవాలు చెప్పాలని అడగడం తెలిసిందే! ఈ సమయంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

అవును... పాకిస్థాన్ లోని అడియాలా జైలులో ఆ దేశ మాజీ ప్రధాని చనిపోయారంటూ కథనాలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. బలుచిస్థాన్ విదేశాంగ శాఖ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ... పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, ఐఎస్ఐ కలిసి ఆయన్ను హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన బ్రతికే ఉన్నారని పీటీఐ సెనేటర్ తెలిపారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన పీటీఐ పార్టీ సెనేటర్ ఖుర్రం జీషన్... అడియాలా జైలులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారని తెలిపారు. అయితే.. పాకిస్థాన్ విడిచి వెళ్లాలంటూ ఆయనపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని తెలిపారు. ఈ సమయంలో ఖాన్ ను బలవంతం చేయడానికి విస్తృత వ్యూహంలో భాగంగా ఆయనను ఒంటరిగా ఉంచుతున్నారని అన్నారు.

ప్రధానంగా... ఇమ్రాన్ ఖాన్ ప్రజాదరణ వల్ల ప్రభుత్వానికి మొప్పు పొంచి ఉందని భావిస్తున్నందున.. ఆయన ఫోటోలు, వీడియోలు విడుదల కావడం లేదని చెప్పిన జీషన్... ఇది అత్యంత దురదృష్టకరమని.. ఆయన సుమారుగా నెల రోజుల నుంచి ఒంటరిగనే ఉంటున్నారని.. ఆయన కుటుంబం, న్యాయవాదులు, పీటీఐ నాయకత్వం సైతం కవలడానికి అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే... ఇమ్రాన్ ఖాన్‌ తో ప్రభుత్వ పెద్దలు ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందులో భాగంగా అతన్ని దేశం విడిచి వెళ్ళమని అడుగుతున్నారని.. అతను విదేశాలకు వెళ్లి తనకు నచ్చిన ప్రదేశంలో మౌనంగా ఉంటే రాయితీలు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నారని.. కానీ ఇమ్రాన్ ఖాన్ దానికి ఎప్పటికీ అంగీకరించడని జీషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏది ఏమైనా.. జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ పాకిస్థాన్ లో ఖాన్ ప్రభావం బలంగా ఉందని.. యువతలో పీటీఐకి విస్తృత మద్దతు కొనసాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా... పీటీఐకి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.