Begin typing your search above and press return to search.

మతి స్థిమితం లేదు... పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ సంచలన ఆరోపణలు!

పాకిస్థాన్ లో ప్రధాని కంటే ఎక్కువగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   6 Nov 2025 9:24 AM IST
మతి స్థిమితం లేదు... పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ సంచలన ఆరోపణలు!
X

పాకిస్థాన్ లో ప్రధాని కంటే ఎక్కువగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా.. మునీర్ పై మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... పాకిస్తాన్ చరిత్రలో అత్యంత నియంత, మానసికంగా అస్థిరమైన వ్యక్తి అని అభివర్ణించారు.

అవును... పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పై ఇమ్రాన్ ఖాన్ తన తీవ్ర విమర్శలను పునరుద్ధరించారు. ఇందులో భాగంగా... అతని పాలనలో నిరంకుశత్వం గతంలో ఎన్నడూ లేనంతస్థాయిలో ఉందని... అధికార దాహంతో మునీర్ ఏదైనా చేయగలడని అన్నారు. ఈ మేరకు ఇమ్రాన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తన భార్యను వేధిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా... మే 9, నవంబర్ 26 తేదీలలో మురిద్కేలో జరిగిన సంఘటనలను అధికారాన్ని గుడ్డిగా ఉపయోగించుకోవడానికి స్పష్టమైన ఉదాహరణలుగా ఖండించిన ఇమ్రాన్ ఖాన్... పోలీసులు, భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో పార్టీ కార్యకర్తల మరణాలను ఆయన గుర్తుచేశారు. నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఏ నాగరిక సమాజం కూడా ఊహించలేనిదని తెలిపారు.

ఇదే క్రమంలో... తన భార్య బుష్రా బీబీని అధికారులు మానసిక ఒత్తిడికి గురిచేయడానికి ఒంటరిగా ఉంచి హింసిస్తున్నారని ఆరోపించిన ఇమ్రాన్ ఖాన్... తాము బానిసత్వం కంటే మరణాన్ని ఇష్టపడతామని స్పష్టం చేశారు. అసిమ్ మునీర్ తనపైనా, తన భార్య పైనా అన్ని రకాలుగా మునీర్ ఇబ్బందులకు గుర్తి చేస్తున్నాడని తెలిపారు. అతడు ఏమి చేసినా.. తాను అతనికి తలవంచను అని ఖాన్ నొక్కి చెప్పాడు.

తనపై చట్టపరమైన చర్యలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించిన ఇమ్రాన్ ఖాన్.. ఈ కేసులు నిరాధారమైనవని, చివరికి తేలిపోతాయని అందరికీ తెలుసని.. అందుకే వాటిని విచారణ నుండి నిలిపివేస్తున్నారని అన్నారు.

కాగా... ఆగస్టు 2023 నుండి పలు కేసుల్లో 73 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అవన్నీ తప్పుడు కేసులని ఆయన వాదిస్తున్నారు. ఇదంతా మునీర్ కావాలని చేస్తున్నారని తెలిపారు.

మునీర్ జీవితాంతం పాక్ ను పాలిస్తారా?:

పాకిస్తాన్‌ ను శక్తివంతమైన సైన్యం పాలిస్తున్నదనీ, ఆ దేశ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ వాస్తవ పాలకుడని.. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పౌర ప్రభుత్వం సైనిక వ్యవస్థకు లోబడి ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో.. ఇస్లామాబాద్ ఇప్పుడు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని సవరించాలని యోచిస్తోందని కథనాలొస్తున్నాయి.

ఇందులో భాగంగా... దేశంలో పౌర-సైనిక పాలనను ప్రవేశపెట్టాలని, పాకిస్తాన్ సైన్యం పౌర ప్రభుత్వంపై నియంత్రణను సమర్థవంతంగా చట్టబద్ధం చేయాలని, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ జీవితాంతం అధికారంలో ఉండటానికి మార్గం సుగమం చేయాలని యోచిస్తోందని.. అదే జరిగితే నియంతృత్వం అధికారికంగా అమలవుతోందని అంటున్నారు.