బంగాళాఖాతంలో మరో తుపాను... 'దిట్వా' అంటే ఏమిటి?
అవును... నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది.
By: Raja Ch | 27 Nov 2025 4:02 PM ISTబంగాళాఖాతాన్ని వరుస తుపానులు పలకరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఈ సముద్ర తీరాన్న ఉన్న ప్రాంతాల ప్రజలు తడిచి, ముద్దై, వణికిపోతున్నారు! ఈ క్రమంలో తాజాగా నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక జలాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది తుపానుగా మారితే "దిట్వా" అని పిలుస్తారు.
అవును... నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక, భూమధ్యరేఖ హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో బాగా గుర్తించబడిన ఈ అల్పపీడనం నవంబర్ 26 రాత్రి వాయుగుండంగా మారిందని ఐఎండీ తెలిపింది. ఇది మరింత బలపడి తుపానుగా మారితే దీనికి "దిట్వా" అని నామకరణం చేస్తారు.
ఇది శ్రీలంకలోని హంబన్ టోటకి తూర్పున 170 కి.మీ., బటికల్లోవాకి ఆంగేయంగా 210 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరోవైపు బంగాళాఖాతం నుంచి దూరంగా కదిలిన సెన్యార్ తుపానుకు సమాంతరంగా ఇది చురుకుగా మారిందని.. నవంబర్ 26 రాత్రి నాటిని సెన్యార్ తుపాను ఈ శాన్య ఇండోనేషియాపై కేంద్రీకృతమై మలక్కా జలసంధిని ఆనుకొను ఉందని తెలిపింది.
‘దిట్వా’ అంటే ఏమిటి..?:
ఈ నేపథ్యంలో ఈ కొత్త వాతావరణ వ్యవస్థ తుపానుగా మారితే.. దానిని దిట్వా అని పిలుస్తారు. దీన్ని యెమెన్ ప్రతిపాదించింది. దిట్వాను డేట్వా అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర హిందూ మహాసముద్రంలో ఉష్ణమండల తుపాను పేర్ల జాబితాకు యెమెన్ అందించిన పేరు. ఇది యెమెన్ లోని సోకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరు. దీన్ని డెట్వా సరస్సు అని కూడా పిలుస్తారు.
ఇక గురువారం మధ్యాహ్నం తర్వాత తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరం, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరం వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది! దీని ప్రభావంతో శని, ఆది, సోమ వారాల్లో దక్షిణ కోస్తా, రాయల సీమ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షలు కురిసే అవకాశం ఉంది.
