అమెరికాలో భారత్ పై ద్వేషం.. హిందూ ఆలయాలపై దాడులకు కుట్ర.. కేంద్రం హైఅలెర్ట్
అమెరికాలోని ఇల్లినాయిస్ వేదికగా భారతీయులు,హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని సాగిన ఒక నరమేధ కుట్ర బయటపడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
By: A.N.Kumar | 15 Oct 2026 8:25 PM ISTఅమెరికాలోని ఇల్లినాయిస్ వేదికగా భారతీయులు,హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని సాగిన ఒక నరమేధ కుట్ర బయటపడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. చికాగో సమీపంలోని అరోరా ప్రాంతంలో ఉన్న హిందూ ప్రార్థనా మందిరంపై సామూహిక కాల్పులకు పక్కా వ్యూహంతో అడుగులేసిన ఒక గన్ ఫైటర్ కుట్ర ఎట్టకేలకు భగ్నమైంది. రైఫిల్లో తలెత్తిన సాంకేతిక లోపం, ఒక తోటి ఉద్యోగి సకాలంలో చూపిన సమయస్ఫూర్తి కలిసి వందలాది మంది భక్తుల ప్రాణాలను కాపాడాయి.
అధికారిక నివేదికలు.. దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం.. ఇల్లినాయిస్లోని పాలటైన్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పపోరాకిస్ మైనారిటీలపై, ముఖ్యంగా భారతీయ సమాజంపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. అక్టోబర్ 10న నిందితుడు పపోరాకిస్ తన సహోద్యోగితో మాట్లాడుతూ తాను భారతీయులను చంపాలనుకుంటున్నానని.. ఒక పెద్ద దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని బయటపెట్టాడు. కేవలం నోటి మాటతో ఆగకుండా దాడిని ఎలా అమలు చేయాలనే వివరాలతో ఒక వ్యూహాత్మక పత్రాన్ని రూపొందించి.. తన వద్ద ఉన్న ప్రాణాంతక ఆయుధాలు , బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల చిత్రాలను సహోద్యోగికి పంపాడు.
మరుసటి రోజు అక్టోబర్ 11న భారీ ఆయుధాలతో అరోరాలోని ఒక హిందూ ఆలయానికి నిందితుడు చేరుకున్నాడు. లోపల ఉన్న భక్తులపై కాల్పులు జరిపేందుకు సిద్ధమైన క్షణంలో అదృష్టవశాత్తూ అతడి వద్ద ఉన్న రైఫిల్ మొరాయించింది. తుపాకీ సరిగా పనిచేయకపోవడంతో నిందితుడు కంగారుపడి అక్కడి నుంచి వెనుదిరిగాడు. అనంతరం ఆయుధంలో తలెత్తిన లోపాన్ని సరిచేసేందుకు మళ్లీ తన సహోద్యోగిని సంప్రదించాడు. నిందితుడి మానసిక స్థితి, అతడి వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ప్రమాదాన్ని గుర్తించిన సహోద్యోగి ఆలస్యం చేయకుండా తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ హెచ్చరికతో రంగంలోకి దిగిన పోలీసులు అక్టోబర్ 11నే పపోరాకిస్ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు నిందితుడి నివాసంలో సోదాలు నిర్వహించగా దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇదొక సాధారణ నేరం కాదని.. తీవ్రమైన జాత్యహంకార ద్వేషంతో కూడిన కుట్ర అని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అతడి ఇంట ఒక ఆటోమేటిక్ రైఫిల్, బహుళ మ్యాగజైన్లు, వందలాది రౌండ్ల సజీవ తూటాలు, వ్యూహాత్మక బాడీ ఆర్మర్, తెల్లజాతి ఆధిపత్య భావజాల గుర్తులు, నాజీ స్వస్తిక చిహ్నాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయులు , ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని సాగించాల్సిన నరమేధ ప్రణాళిక పత్రాలు కూడా లభించాయి.
అరెస్టయిన పపోరాకిస్పై అమెరికా పోలీసులు ఉగ్రవాద బెదిరింపులు, చట్టవిరుద్ధంగా ప్రాణాంతక ఆయుధాలను కలిగి ఉండటం వంటి అత్యంత తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. అంతర్జాతీయ , జాతి విద్వేష కోణాలు ఉన్నందున ఈ కేసు దర్యాప్తులో ఎఫ్బీఐ నేరుగా భాగస్వామి అయింది. నిందితుడికి కోర్టు బెయిల్ నిరాకరించి జైలుకు తరలించింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 30న జరగనుంది. అయితే న్యాయ ప్రక్రియ ప్రకారం నేరం రుజువయ్యే వరకు నిందితుడిని నిందితుడిగానే పరిగణిస్తారు.
అమెరికాలో భారతీయుల భద్రతపై భారత్ ఆందోళన
అమెరికాలో భారతీయులే లక్ష్యంగా అదీ పవిత్రమైన హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర జరగడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు, భారతీయ సమాజాల భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. జాతి, మత విద్వేషాలతో సాగే ఇటువంటి ఉగ్ర చర్యలను ఏమాత్రం సహించబోమని, అమెరికా అధికారులు సమగ్ర విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేసింది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్లు స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ, ఆలయాలు భారతీయ సంస్థల వద్ద భద్రతను సమీక్షిస్తున్నాయి.
విద్యావేత్తలుగా, ఐటీ నిపుణులుగా, వ్యాపారవేత్తలుగా అమెరికా అభివృద్ధిలో భారతీయులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ ఇటీవల కాలంలో మైనారిటీలపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రార్థనా మందిరాలు వంటి భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడే ప్రదేశాల్లో తుపాకీ సంస్కృతి జాత్యహంకార భావజాలం చొరబడటం వల్ల అమెరికాలోని భారతీయ కుటుంబాలు భయాందోళనలకు గురవుతున్నాయి.
అరోరా ఘటన ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. అమెరికా యంత్రాంగం వేగంగా స్పందించి ప్రమాదాన్ని నివారించినప్పటికీ విద్వేష భావజాలంపై కఠినమైన చట్టాలు , ముందస్తు చర్యలు తీసుకోకపోతే ఇటువంటి ముప్పు పొంచి ఉంటుందనేది స్పష్టమవుతోంది.
