Begin typing your search above and press return to search.

లండన్‌లో భారతీయ రెస్టారెంట్‌కు నిప్పు..టీనేజర్ సహా ఇద్దరి అరెస్ట్

తూర్పు లండన్‌లోని ఇల్ఫోర్డ్‌లో ఉన్న ఓ భారతీయ రెస్టారెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.

By:  A.N.Kumar   |   25 Aug 2025 6:00 PM IST
లండన్‌లో భారతీయ రెస్టారెంట్‌కు నిప్పు..టీనేజర్ సహా ఇద్దరి అరెస్ట్
X

తూర్పు లండన్‌లోని ఇల్ఫోర్డ్‌లో ఉన్న ఓ భారతీయ రెస్టారెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు ఒక 15 ఏళ్ల బాలుడిని, 54 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. జీవనానికి ముప్పు కలిగించే ఉద్దేశంతో నిప్పు పెట్టారన్న అనుమానంపై వీరిపై కేసు నమోదు చేశారు.

- ప్రమాదం జరిగిందిలా..

శుక్రవారం రాత్రి 9:02 గంటల సమయంలో ఇల్ఫోర్డ్‌లోని ఇండియన్ అరోమా రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే లండన్ ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భోజనం చేయడానికి వచ్చిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు కాలిన గాయాలతో తీవ్రంగా బాధపడ్డారు. వారిని లండన్ అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక మహిళ, ఒక పురుషుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు బాధితులు సంఘటన స్థలం నుండి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు, వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

-నిందితుల అరెస్ట్, దర్యాప్తు

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన మెట్రోపాలిటన్ పోలీసులు, రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. ఇద్దరు నిందితులు మాస్కులు ధరించి రెస్టారెంట్‌లోకి వచ్చి, కావాలనే నిప్పు పెట్టినట్లు నిర్ధారించారు. ఈ నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఒక 15 ఏళ్ల బాలుడు, ఒక 54 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు, నిందితుల ఉద్దేశాలు ఇంకా తెలియాల్సి ఉందని మెట్రోపాలిటన్ పోలీసుల డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ మార్క్ రోజర్స్ వెల్లడించారు. వారాంతం మొత్తం పోలీసులు గాంట్స్ హిల్‌లోని వుడ్‌ఫోర్డ్ అవెన్యూ ప్రాంతంలో నిఘా పెంచారు.

- రెస్టారెంట్ వివరాలు

ఈ రెస్టారెంట్‌ను తెలుగు రాష్ట్రాలకు చెందిన రోహిత్ కలువల నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ గుత్తి వంకాయ వంటి ఆంధ్ర-తెలంగాణ ప్రత్యేక వంటకాలతో పాటు, అసలు భారతీయ వంటకాలను అందించడంలో ప్రసిద్ధి చెందిందని రెస్టారెంట్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ రెస్టారెంట్ సినిమా, టీవీ బృందాలు, అలాగే వ్యాపార, సాంస్కృతిక.. దాతృత్వ కార్యక్రమాలకు కూడా మంచి వేదికగా పేరు పొందింది. ఈ ఘటన వల్ల రెస్టారెంట్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.