Begin typing your search above and press return to search.

ఐఐటీ గౌహతి స్టూడెంట్స్ చేసిన ఈ ప్రయోగం తెలిస్తే వావ్ అనేస్తారంతే

వీరి పరిశోధన ఇప్పుడు దేశీయ బయో ఇంధన రంగం ముఖచిత్రంలో కీలకంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By:  Garuda Media   |   29 May 2026 10:20 AM IST
ఐఐటీ గౌహతి స్టూడెంట్స్ చేసిన ఈ ప్రయోగం తెలిస్తే వావ్ అనేస్తారంతే
X

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంధన స్వాలంబన అన్నది దేశానికి చాలా ముఖ్యం. ఇలాంటి వేళలో ఐఐటీ గౌహతి విద్యార్థుల ఆవిష్కరణ ఒకటి ఆసక్తికరంగానే కాదు.. భవిష్యత్తు మీద సరికొత్త ఆశలకు తెర తీసేలా మారింది. ఇప్పటివరకు ఎవరూ ఫోకస్ చేయని అంశం మీద దృష్టి పెట్టిన విద్యార్థులు ఆశ్చర్యకరమైన ఆవిష్కరణకు కారణమయ్యారు. వీరి పరిశోధన ఇప్పుడు దేశీయ బయో ఇంధన రంగం ముఖచిత్రంలో కీలకంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకు వీరు ఏం చేశారు? దాని కారణంగా ఏం జరగనుంది? లాంటి వివరాల్లోకి వెళితే.. పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

సింఫుల్ గా ఒక్క వ్యాక్యంలో చెప్పాలంటే.. ఒక బ్యాక్టీరియాతో బయో మిథనాల్ తయారు చేయొచ్చన్న సరికొత్త ఆవిష్కరణకు ఐఐటీ గౌహతి విద్యార్థులు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇప్పటివరకు బయో మిథనాల్ తయారీకి అనుసరించే విధానానికి పూర్తి భిన్నంగా ఈ తీరు ఉండటం విశేషం. సాంప్రదాయ పద్దతుల్లో మిథనాల్ తయారీ చేసేందుకు భారీ ఉష్ణోగ్రత.. ఖరీదైన రసాయన ఉత్ప్రేరకాలు అవసరం. అయితే.. ఐఐటీ గౌహతి విద్యార్థులు ఇలాంటి రసాయనాలతో పని లేకుండా ఒక బ్యాక్టీరియాతో బయో మిథనాల్ తయారు చేసే విధానాన్ని గుర్తించారు.

సాధారణంగా బయో ఇంధనాలను మొక్కలు లేదంటే ఆహార పంటల ద్వారా తయారు చేస్తారు. దీని కారణంగా ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకు భిన్నంగా విద్యార్థులు తయారు చేసే విధానంలో పంటలతో పని లేదు. ఈ కారణంగా ఆహార భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదు. అంతేకాదు..ఈ విధానంలో ఎలాంటి విషపూరిత రసాయనాలు విడుదల కాకపోవటం మరో విశేషం. ఇంతకూ వీరేం చేశారు? అన్న విషయంలోకి వెళితే.. ముందుగా మిథైలోసైనస్ ట్రైకోస్పోరియమ్ అనే ఒక బ్యాక్టీరియా గురించి తెలుసుకోవాలి.

అప్పుడు విషయాలు మరింత తేలిగ్గా.. సులువుగా అర్థం కావటమే కాదు.. మన విద్యార్థులు సాధించిన ఘనత ఇట్టే అర్థమవుతుంది. ఈ బ్యాక్టీరియాకు ఉన్న ప్రత్యేక శక్తి ఏమంటే.. ఎలాంటి రసాయనాలు లేకుండా.. సాధారణ గది ఉష్ణోత్రత వద్దే చాలా సులువుగా మిథేన్ వాయువును విడగొట్టి మిథనాల్ గా మారుస్తుంది. అదెలా అంటారా? ఒక చిన్న ఉదాహరణతో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందో తెలుస్తుంది.

మొక్కలు వాతావరణంలోని కార్బన్ డైయాక్సైడ్.. సూర్యరశ్హి.. నీటిని తీసుకొని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనకు అవసరమైన పిండి పదార్థాలు.. ఆక్సిజన్ ను ఎలా తయారు చేస్తాయో.. ఈ బ్యాక్టీరియా కాలుష్య వాయువులైన మిథేన్.. కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని.. తన లోపల జరిగే జీవక్రియల ద్వారా మనకు అవసరమైన ద్రవ మిథనాల్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం సహజ ప్రక్రియ ద్వారానే జరుగుతుంది కాబట్టి.. దీని కారణంగా ప్రమాదకర రసాయనాలు వాడాల్సిన అవసరం ఉండదు.

మిథైలోసైనస్ ట్రైకోస్పోరియమ్ అనే బ్యాక్టీరియా ల్యాబ్ లో పుట్టించింది కాదు. కొన్ని లక్షల ఏళ్ల నుంచి భూమిపై సహజంగా పరిణామం చెందిన ఒక సూక్ష్మజీవి. ఇంతకు ఇదెక్కడ ఉంటుందన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. చిత్తడి నేలలు.. బురద ప్రాంతాలతో పాటు.. కుళ్లిపోతున్న పదార్థాలు ఉన్న చోట.. వరిపొలాల్లో నీరు నిల్వ ఉండే మట్టిలో భారీగా ఉంటుంది. ఇది మనుషులకు ఎలాంటి హాని చేసే బ్యాక్టీరియా కాదు. అంటే.. మంచి బ్యాక్టీరియా అన్న మాట. దీన్ని 1970లో బ్రిటన్ కు చెందిన ప్రొఫెసర్ రోజర్ విట్టెన్ బరీ ఆయన టీం తొలిసారి గుర్తించారు.

వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం.. మట్టిలో జరిగే సహజ మార్పులపై పరిశోధన చేస్తున్నప్పుడు దీన్ని గుర్తించారు. ల్యాబ్ లో దీన్ని పరిశీలించినప్పుడు.. మిథేన్ వాయువును తిని బతికే విలక్షణమైన బ్యాక్టీరియా జాతిగా గుర్తించారు. ఇప్పటివరకు ఈ బ్యాక్టీరియాను ప్రమాదకర రసాయన వ్యర్థాలు.. భూగర్భ జలాల్లో కలిసినప్పుడు వాటిని శుద్ధి చేసేందుకు దీన్ని వాడేవారు. ఈ బ్యాక్టీరియాలోని సొల్యూబుల్ మిథేన్ మోనోఆక్సిజనేస్ అనే ఎంజైమ్ ఈ విషపూరిత రసాయనాలను పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుందని గుర్తించారు.

ఇలాంటి బ్యాక్టీరియాను ఐఐటీ గౌహతి విద్యార్థులు బయో మిథేన్ ఉత్పత్తికి వినియోగించొచ్చన్న విషయాన్ని గుర్తించటమేకాదు.. అదెలా సాధ్యమో చూపించారు. ఇంతకూ ఈ బ్యాక్టీరియాతో బయో మిథేన్ ఇంధనాన్ని ఎలా తయారు చేస్తారన్న విషయానికి వస్తే.. రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో బయో రియాక్టర్ ట్యాంకులో ఈ బ్యాక్టీరియాను ఉంచి.. వాటికి ఆహారంగా మిథేన్ వాయువును అందిస్తారు. దీన్ని ఆహారంగా తీసుకున్న బ్యాక్టీరియా వేగంగా కోట్లాది సంఖ్యలో డెవలప్ వుతాయి. దీన్ని బయోమాస్ వృద్ధిగా చెప్పొచ్చు.

బ్యాక్టీరియా బాగా పెరిగిన తర్వాత ఆ ట్యాంకుల్లోకి కార్బన్ డైయాక్సైడ్ వాయువును పంపుతారు. ఈ దశలో బ్యాక్టీరియా కార్బన్ డయాక్సైడ్ ను తాము నిల్వ చేస్తున్న శక్తిని ఉపయోగించుకొని ఒక రసాయన చర్య ద్వారా ద్రవ రూపంలో ఉండే బయో మిథనాల్ ను బయటకు విడుదల చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ సహజ సిద్ధంగా సాగటంతో భారీ ఎత్తున ఇంధన ప్రయోజనాలు దీన్ని వినియోగించుకునే వీలుంది. ఈ వాణిజ్య సూత్రాన్ని గుర్తించిన హైదరాబాద్ కు చెందిన కాశ్యప్ క్లీన్ టెక్ ఇన్నోవేషన్స్ సంస్థ ఐఐటీ గౌహతితో ఒప్పందం చేసుకుంది.. మొత్తంగా బయో మిథనాల్ తయారీలో ఒక కొత్త శకం మొదలైనట్లుగా చెప్పక తప్పదు.