Begin typing your search above and press return to search.

ఐఐటీ బాంబే స్టూడెంట్ ఆత్మహత్య.. బయటికొచ్చిన సీసీటీవీ వీడియో.. అసలేం జరిగింది?

దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By:  A.N.Kumar   |   24 Sept 2026 2:44 PM IST
ఐఐటీ  బాంబే స్టూడెంట్ ఆత్మహత్య.. బయటికొచ్చిన సీసీటీవీ  వీడియో.. అసలేం జరిగింది?
X

దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాహిల్ పరీక్ష రాస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ వీడియోను దర్యాప్తులో కీలక ఆధారంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 18న పరీక్ష అనంతరం సాహిల్ తన హాస్టల్ గదిలో మృతిచెందాడు.

సీసీటీవీ లో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. పరీక్ష జరుగుతున్న సమయంలో సాహిల్ తన మొబైల్ ఫోన్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ సమయంలో పరీక్షను పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ డూళ్లా అతడి వద్దకు వెళ్లి ప్రశ్నించినట్లు వీడియోలో ఉంది. అనంతరం సాహిల్ నుంచి పరీక్ష పేపర్, ఆన్సర్ షీట్ తీసుకుని అతడిని పరీక్ష హాల్ నుంచి బయటకు తీసుకెళ్లినట్లు దృశ్యాలు చూపిస్తున్నాయి. ఈ ఘటన మధ్యాహ్నం 12.30 నుంచి 12.45 గంటల మధ్య జరిగినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.

సాహిల్ పరీక్షలో మొబైల్ ఫోన్ ద్వారా చాట్ జీపీటీ ఉపయోగించి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు కూడా మొదట వెలువడ్డాయి. అయితే ఈ అంశంతో పాటు పరీక్ష హాల్లో ప్రొఫెసర్, సాహిల్ మధ్య అసలు ఏం జరిగింది? వారి మధ్య ఏదైనా వాగ్వాదం జరిగిందా? వంటి విషయాలను కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. పరీక్ష హాల్లో ఉన్న ఇతర విద్యార్థుల వాంగ్మూలాలను సైతం అధికారులు నమోదు చేయనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. సాహిల్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి ఆత్మహత్యకు కుల వివక్ష, వేధింపులు, ఒత్తిడే కారణమని ఆరోపిస్తున్నారు. ప్రొఫెసర్ సూర్యనారాయణ డూళ్లా, ఐఐటీ బాంబే డైరెక్టర్‌పై కూడా సాహిల్ తండ్రి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కేసు నమోదు కాగా, దర్యాప్తు ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ చేతుల్లో ఉంది. అయితే కుటుంబం చేసిన కుల వివక్ష ఆరోపణలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి.. వాటిపై తుది నిర్ధారణ వెలువడలేదు.

మరోవైపు, ప్రొఫెసర్ డూళ్లాకు మద్దతుగా ఐఐటీ బాంబేలోని కొంతమంది ఫ్యాకల్టీ సభ్యులు కూడా స్పందించారు. ఆయన పరీక్షలో విధులు నిర్వర్తించే క్రమంలోనే సాహిల్‌పై చర్య తీసుకున్నారని వారు పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం క్యాంపస్‌లో విద్యార్థులు, అధ్యాపకుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ వీడియోతో పరీక్ష హాల్లో జరిగిన ఘటనకు సంబంధించి ఒక స్పష్టమైన దృశ్య ఆధారం దర్యాప్తు సంస్థలకు లభించినప్పటికీ సాహిల్ ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలు మాత్రం ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడి కదలికలు, ఫోన్‌లోని సమాచారం, స్నేహితులు, ఇతర విద్యార్థుల వాంగ్మూలాలు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది.