దోమలు లేని దేశం ఇక లేదు.. అక్కడ కూడా మోపిన ఉక్కుపాదం
మనుషుల ప్రమేయం కూడా ఉందా?: దోమలు కేవలం గాలిలో ఎగురుతూ అక్కడికి చేరుకోలేదు.
By: Madhu Reddy | 12 May 2026 7:00 PM ISTప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశంగా ఐస్లాండ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. వేల ఏళ్లుగా అక్కడ ఒక్క దోమ కూడా కనిపించేది కాదు. కానీ, ప్రకృతిలో వస్తున్న మార్పుల వల్ల ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. ఐస్లాండ్ రాజధాని రేక్జావిక్ సమీపంలో శాస్త్రవేత్తలు దోమలను గుర్తించడంతో ఆ దేశ ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. అడవి జంతువులకు, మనుషులకు ప్రశాంతతనిచ్చే ఆ మంచు ద్వీపంలో దోమలు ఎలా ఎంట్రీ ఇచ్చాయో ఇప్పుడు చూద్దాం..
ఐస్లాండ్‌లో దోమల బోణి:
ఆర్కిటిక్ ప్రాంతంలోని దేశాలన్నింటిలో దోమల హోరు ఎక్కువగా ఉంటుంది, కానీ ఐస్లాండ్‌లో మాత్రం అవి అస్సలు ఉండేవి కావు. అక్కడ ఉండే చల్లని వాతావరణం, మంచు గడ్డకట్టే తీరు దోమలు పెరగడానికి సహకరించేది కాదు. అయితే, తాజాగా 'సైన్స్' జర్నల్‌లో ప్రచురితమైన రిపోర్ట్ ప్రకారం.. ఐస్లాండ్ ఉత్తర ప్రాంతంలో దోమలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇక దోమలు లేని దేశం అనే బిరుదును ఐస్లాండ్ కోల్పోయింది.
వాతావరణ మార్పులే అసలు కారణం:
ప్రపంచం మొత్తం మీద ఆర్కిటిక్ ప్రాంతం నాలుగు రెట్లు వేగంగా వేడెక్కుతోంది. ఎండలు పెరగడం, మంచు త్వరగా కరిగిపోవడం వల్ల దోమలు బతకడానికి కావాల్సిన వాతావరణం అక్కడ తయారవుతోంది. గతంలో దోమలు అక్కడ గుడ్లు పెట్టినా అవి పొదిగేవి కావు, కానీ ఇప్పుడు మారుతున్న వేడి వల్ల అవి హాయిగా వృద్ధి చెందుతున్నాయి. ఇక ఇది కేవలం దోమల సమస్య మాత్రమే కాదు, భూగోళం ఎంత వేగంగా మారిపోతుందో చెప్పడానికి ఒక పెద్ద హెచ్చరిక.
మనుషుల ప్రమేయం కూడా ఉందా?: దోమలు కేవలం గాలిలో ఎగురుతూ అక్కడికి చేరుకోలేదు. పెరుగుతున్న షిప్పింగ్ వ్యాపారం, టూరిజం, వల్ల దోమలు ఓడలు, విమానాల ద్వారా కొత్త ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఇక ఒకప్పుడు ఒంటరిగా, ప్రశాంతంగా ఉన్న ఐస్లాండ్ వంటి దేశాలకు మనుషుల రాకపోకల ద్వారా ఇలాంటి కీటకాలు ప్రయాణిస్తున్నాయి.
జీవవైవిధ్యంపై పడే ప్రభావం:
దోమలు రావడం వల్ల అక్కడి పర్యావరణం మొత్తం తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, ఆర్కిటిక్ పక్షులు కీటకాలు పుట్టే సమయాన్ని బట్టి ఆహారం తింటాయి. ఇప్పుడు ఆ సమయం మారుతుండటంతో పక్షులకు తిండి దొరకడం కష్టమవుతోంది.
దోమలు రావడం అంటే కేవలం ఒక చిన్న కీటకం రావడం కాదు, ప్రకృతి తన సమతుల్యతను కోల్పోతోందని అర్థం. ఐస్లాండ్ ప్రజలకు ఇది ఒక కొత్త రకమైన చికాకు కావచ్చు, కానీ ప్రపంచానికి మాత్రం ఇది గ్లోబల్ వార్మింగ్ ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్. ఇప్పటికైనా మనం పర్యావరణం గురించి ఆలోచించకపోతే, ఇలాంటి మార్పులు మరిన్ని చూసే అవకాశం ఉంది.
