పార్ట్ టైం ఉద్యోగాలు చేసే భారత విద్యార్థులే టార్గెట్.. ఏరివేత షురూ చేసిన అమెరికా
ముఖ్యంగా వీసా నిబంధనలు ఉల్లంఘించి 'క్యాంపస్' వెలుపల అనధికారికంగా పార్ట్-టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులపై అధికారులు నిఘా పెంచడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
By: A.N.Kumar | 17 Jan 2026 5:00 PM ISTఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. అగ్రరాజ్యంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా వీసా నిబంధనలు ఉల్లంఘించి 'క్యాంపస్' వెలుపల అనధికారికంగా పార్ట్-టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులపై అధికారులు నిఘా పెంచడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
నిబంధనల ఉల్లంఘనే టార్గెట్
సాధారణంగా అమెరికాకు వచ్చే విద్యార్థులు F-1 వీసాపై వెళ్తారు. ఈ వీసా నిబంధనల ప్రకారం.. విద్యార్థులు కేవలం తమ విద్యాలయ ప్రాంగణంలో మాత్రమే పని చేయాలి. వారానికి గరిష్టంగా 20 గంటలు మాత్రమే పని చేయడానికి అనుమతి ఉంటుంది. యూనివర్సిటీ వెలుపల ఉన్న రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, గ్రాసరీ స్టోర్లలో పని చేయడం అమెరికా చట్టాల ప్రకారం నేరంగా పరిగణిస్తారు. అయితే అమెరికాలో పెరుగుతున్న జీవన వ్యయం, ఫీజుల భారం తట్టుకోలేక చాలా మంది భారతీయ విద్యార్థులు గుట్టుచప్పుడు కాకుండా గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లలో నగదు ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఐసీఈ అధికారులు అటువంటి ప్రాంతాలపైనే ప్రత్యేక దృష్టి సారించారు.
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
గత కొన్ని వారాలుగా ఐసీఈ అధికారులు వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లపై రాండమ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పనిచేస్తున్న వారి ఐడీ కార్డులు పని పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. స్టోర్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అక్కడ విద్యార్థులు పనిచేస్తున్నారా లేదా అని నిర్ధారించుకుంటున్నారు. స్థానిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చాలా మంది భారతీయ విద్యార్థులు భయాందోళనతో తమ పార్ట్-టైం ఉద్యోగాలను వదిలిపెడుతున్నారు. మరికొందరు విద్యార్థులు గ్రూప్ చాట్లలో ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటున్నారు.
పొంచి ఉన్న ప్రమాదాలు
అనధికారికంగా పని చేస్తూ పట్టుబడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన క్షణమే విద్యార్థి వీసా చెల్లే అవకాశం ఉండదు. వీసా రద్దు చేసి అక్రమంగా పనిచేస్తూ దొరికితే వెంటనే స్వదేశానికి పంపించివేసే ప్రమాదం ఉంది. ఒక్కసారి డిపోర్ట్ అయితే భవిష్యత్తులో తిరిగి అమెరికాలోకి ప్రవేశించకుండా శాశ్వత నిషేధం విధించే అవకాశం ఉంది.
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు కేవలం చట్టబద్ధమైన మార్గాల్లోనే (సీపీటీ/ఓపీటీ వంటి అనుమతులతో) పని చేయాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. "కొద్దిపాటి అదనపు సంపాదన కోసం జీవితకాల కలను పణంగా పెట్టవద్దు" అని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతానికి ఐసీఈ నుంచి అధికారిక గణంకాలు వెలువడనప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తనిఖీలు మాత్రం విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విద్యార్థులు తమ వీసా హోదాను కాపాడుకోవడానికి నిబంధనలకు కట్టుబడి ఉండటమే ఏకైక మార్గం.
