ఐ బొమ్మ.. బప్పం పేర్లు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి
ఐదు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత అదనపు వివరాల కోసం మరో మూడు రోజుల కస్టడీని కోరిన పోలీసులు.. తాజాగా పలు అంశాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
By: Garuda Media | 30 Nov 2025 9:46 AM ISTఐదు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత అదనపు వివరాల కోసం మరో మూడు రోజుల కస్టడీని కోరిన పోలీసులు.. తాజాగా పలు అంశాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. రెండో దఫా కస్టడీలోకి తీసుకున్న సందర్భంగా అప్పటివరకు క్లారిటీ లేని అంశాల మీద రవి వివరణ తీసుకోవటంతో పాటు.. మిగిలిన సందేహాలకు సమాధానాల్ని గుర్తించారు. తను స్టార్ట్ చేసిన ఐ బొమ్మ.. బప్పం వెబ్ సైట్లకు ఆ పేర్లు ఎందుకు పెట్టినట్లు? అన్న ప్రశ్నకు రవి సమాధానం ఇచ్చాడు.
విశాఖకు చెందిన ఐ బొమ్మ రవి.. తాను స్టార్ట్ చేసిన వెబ్ సైట్ కు ఆ పేరు ఎందుకు పెట్టానో చెబుతూ.. ‘విశాఖపట్నంలో సినిమా కోసం థియేటర్ కు వెళితే.. సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు బొమ్మ పడుతుందనేవారు. దాంతో డొమైన్ కు ఐ బొమ్మ అనే పేరు పెట్టా. ఐ బొమ్మ అంటే నా బొమ్మ (నా సినిమా) అని అర్థం. బప్పం అంటే సుప్రీం అని అర్థం. నా బొమ్మకు నేనే సుప్రీమ్ గా ఉండాలన్నది నా ఉద్దేశం. అందుకే ఆ పేరును ఎంపిక చేసుకున్నా’’ అంటూ తన డొమైన్ పేర్ల వెనుకున్న కథను చెప్పుకొచ్చారు.
డొమైన్ల నిర్వహణ.. వాటి డిజైన్ వంటి అంశాలపైనా స్పష్టత ఇచ్చారు. యూకేలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తానీ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. కరేబియన్ దీవులకు చెందిన వారు సైతం పని చేశారన్నారు. డొమైన్లలో అప్ లోడ్ చేసిన కొత్త సినిమాలను టెలిగ్రామ్ యాప్ ద్వారా కొనుగోలు చేయటం.. ఓటీటీ వేదికలపై రికార్డు చేసిన వాటిని పలు సాఫ్ట్ వేర్ల సాయంతో హెచ్ డీ క్వాలిటీగా మార్చిన విషయాన్ని ఐ బొమ్మ రవి ఒప్పుకున్నట్లుగా అనధికారికంగా అందిన సమాచారంతో వెల్లడైంది.
కస్టడీ ముగిసిన నేపథ్యంలో తదనతరం ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరికొంత కాలం జైల్లో ఉండాల్సి ఉంటుందని.. కొత్త సంవత్సరం నాటికి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. పోలీసులు ఐ బొమ్మ రవి బెయిల్ కు ప్రతికూలంగా స్పందించే వీలుందంటున్నారు. కస్టడీ వేళ సాంకేతిక అంశాల సమాచారాన్ని సేకరించినా.. వాటికి సంబంధించిన ఆధారాల్ని గుర్తించటం అంత తేలికైన విషయం కాదంటున్నారు. బెయిల్ తో బయటకు వస్తే విచారణకు ఆటంకం కలిగించేలా ఐ బొమ్మ రవి వ్యవహరించొచ్చని.. ఆధారాలు దొరక్కుండా చేయొచ్చని.. అందుకే మరికొంత కాలం జైల్లోనే ఉండేలా చూడాలని కోర్టును కోరే అవకాశం ఉందంటున్నారు.
