ఎవరా ప్రహ్లాద్.. మాట మార్చేస్తున్న ఐబొమ్మ రవి!
ఐబొమ్మ రవి చేపట్టిన కార్యకలాపాల్లో రవి.. ప్రహ్లాద్ అనే పేర్లు కీలకంగా మారాయి. వీరికి సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
By: Garuda Media | 19 Dec 2025 10:07 AM ISTసంచలనంగా మారిన ఐబొమ్మ రవి వ్యవహారంలో మళ్లీ పోలీసుల విచారణ పర్వం మొదలైంది. తాజాగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మూడోసారి పోలీసు కస్టడీలోకి వెళ్లిన రవిని మూడు కేసుల్లో విచారించనున్నారు. ఈసారి పోలీసుల కస్టడీ పన్నెండు రోజుల పాటు సాగనుంది. అయితే.. ఈ విచారణ సందర్భంగా పోలీసులు అడుగుతున్న వారి వివరాల్ని రవి ఇవ్వట్లేదన్నట్లుగా తెలుస్తోంది.
ఐబొమ్మ రవి చేపట్టిన కార్యకలాపాల్లో రవి.. ప్రహ్లాద్ అనే పేర్లు కీలకంగా మారాయి. వీరికి సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. రవి నుంచి మాత్రం సానుకూలంగా వ్యవహరించటం లేదన్నది సమాచారం. పోలీసుల విచారణలో ప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించిన వివరాలపై ఆరా తీసినప్పుడు.. అతను ప్రసాద్ పదో తరగతి స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు.
అదే సమయంలో ప్రహ్లాద్ ఆచూకీ మాత్రం లభించలేదు. తొలిసారి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించిన సమయంలో మాత్రం ప్రహ్లాద్ కు సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తూ.. అతను అమీర్ పేట కోచింగ్ సెంటర్ లో ఐటీ కోర్సుల్ని నేర్చుకునేటప్పుడు పరిచయమైనట్లుగా పేర్కొన్నారు. దీంతో.. ప్రహ్లాద్ గురించిన వివరాల్ని మరిన్ని అడిగిన తర్వాత నుంచి మాత్రం తనకు ప్రహ్లాద్ గురించి తెలీదని మాట మార్చాడు.
ఈ నేపథ్యంలో ప్రహ్లాద్ కు సంబంధించి మరిన్ని ప్రశ్నల్ని సంధించినప్పటికీ రవి మాత్రం మౌనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రవికి సంబంధించినంతవరకు ప్రహ్లాద్ అత్యంత కీలకమైన వ్యక్తిగా చెబుతున్నారు. కారణం. ఐబొమ్మ రవి ఆధార్.. పాన్ కార్డు.. డ్రైవింగ్ లైసెన్సుతో పాటు కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వం కూడా ఇదే పేరు మీద తీసుకున్నాడు. అంతేకాదు.. ఐబొమ్మ వెబ్ సైట్ ను సైతం ప్రహ్లాద్ పేరు మీదనే రిజిస్టర్ చేసి ఉండటంతో ఆ పేరు వెనకున్న వివరాల్ని తెలుసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐబొమ్మ రవి మాత్రం ఆ వివరాల్ని వెల్లడించకుండా పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నట్లుగా తెలుస్తోంది. తదుపరి విచారణలో ఆ సమాచారాన్ని రాబడతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
