Begin typing your search above and press return to search.

మరోసారి పోలీసు కస్టడీకి.. ఐబొమ్మ రవి నుంచి ఇంకా ఏమి తెలియాలంటే..!

అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత చర్చనీయాంశమైన ఐబొమ్మ రవి అరెస్టు కేసులో పోలీసులు అతన్ని ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   27 Nov 2025 2:24 PM IST
మరోసారి పోలీసు కస్టడీకి.. ఐబొమ్మ రవి నుంచి ఇంకా ఏమి తెలియాలంటే..!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటి ఐబొమ్మ రవి కేసు అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. సుమారు ఆరేళ్లపాటు అటు పోలీసులను, ఇటు సినీ రంగాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఈ ఐబొమ్మ వెనకున్న మాస్టర్ మైండ్ పోలీసుల విచారణ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో మరోసారి ఇమంది రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత చర్చనీయాంశమైన ఐబొమ్మ రవి అరెస్టు కేసులో పోలీసులు అతన్ని ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఐదు రోజుల కస్టడీలో భాగంగా.. గేమింగ్ యాప్ ల నిర్వాహకులతో సంబంధాలపైనా.. అతనికి సహకరిస్తున్న వారి పైనా, తెర వెనుక ఉన్న వారి గురించి ప్రశ్నించినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో... సైబర్ నేరాలకు వేదికగా ఐబొమ్మ సైట్ ను నేరగాళ్ళు మలుచుకున్నట్లు అనుమానించిన పోలీసులు.. సినిమాల సేకరణ నుంచి సైట్ లో అప్ లోడ్ వరకూ దీనికి సంబందించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. అదేవిధంగా... విదేశాల్లో టీమ్ లు, అక్కడున్న ఆస్తులు, లింకులపైనా ఆరా తీసారు! అయితే.. మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా.. నేటి నుంచి 3 రోజుల పాటు అతడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. పైన చెప్పుకున్నట్లుగా గతంలో ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించారు. అయితే.. మరిన్ని కీలక విషయాలు తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు!

ఇందులో భాగంగా... ప్రధానంగా అతడి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో దొరకలేదని భావించిన పోలీసులు.. ఈ మూడు రోజుల కస్టడీలో దానిపై దృష్టి పెట్టనున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు రవిని చంచల్ గూడ జైలు నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడి నెట్ వర్క్ పైనా మరింత దృష్టి పెట్టనున్నారని అంటున్నారు.

అన్నీ తానై నడిపించాడు!:

కొత్త సినిమాల పైరసీ కేసులో మాస్టర్ మైండ్ గా చెబుతోన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి అన్నీ తానై నడిపించాడని.. తమిళ వెబ్ సైట్ల నుంచి పైరసీ సినిమాలు కొనుగోలు చేసి, వాటిని హెచ్.డీ. క్వాలిటీగా మార్చేవాడని, అనంతరం వాటిని ఐబొమ్మ, బెప్పం వెబ్ సైట్లలో అప్ లోడ్ చేసేవాడని హైదరాబాద్ సిటీ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.