పోలీస్ జాబ్ కు నో.. ‘ఐ బొమ్మ’ రెస్టారెంట్.. ఎక్కడంటే?
ఇందులో భాగంగా కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెడతానని చెప్పిన రవి.. అందుకు ‘ఐ బొమ్మ’ రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
By: Garuda Media | 3 Dec 2025 9:33 AM ISTటెక్నాలజీ సాయంతో కొత్త సినిమాల్ని హెచ్ డీ ప్రింట్ లోకి మార్చి తన వెబ్ సైట్ లో వీక్షించే అవకాశం కల్పించటం ద్వారా.. పెద్ద ఎత్తున పాపులర్ అయిన ఐబొమ్మ వెబ్ సైట్ అధినేత ఐబొమ్మ రవిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. రెండు దఫాలు కస్టడీలోకి తీసుకొని విచారించటం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ఐ బొమ్మ వ్యవహరించిన తీరు పోలీసు అధికారుల్లోనూ చర్చగా మారింది. టెక్నాలజీ మీద అతడికి ఉన్న పట్టు.. అతడి తెలివితేటల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పోలీసు జాబ్ కు ఆఫర్ చేసిన వైనం వెలుగు చూసింది.
‘తప్పుడు పనులు చేస్తే.. ఎక్కడున్నా వెతికి.. వెంటాడి పట్టుకునే పోలీసులతో ఉంటూ.. నీ తెలివిని అందరి మంచి కోసం ఉపయోగించుకునేలా పోలీస్ జాబ్ ఇస్తాం.. పని చేస్తావా?’ అని ప్రశ్నించగా.. అందుకు బదులుగా చిరునవ్వుతో సదరు ఆఫర్ ను రిజెక్టు చేసిన ఐబొమ్మ రవి తన ప్యూచర్ ప్లాన్ గురించి ఊహించని రీతిలో సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాను ఎవరి దగ్గరా పని చేయాలని అనుకోవటం లేదని.. తాను ఒంటరిగా ఉంటూ.. తనకు నచ్చిన వ్యాపకంలో పని చేయాలన్నది తన ఆలోచనగా రవి చెప్పినట్లు సమాచారం.
ఇందులో భాగంగా కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ పెడతానని చెప్పిన రవి.. అందుకు ‘ఐ బొమ్మ’ రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులకు సైతం విస్మయానికి గురి చేసేలా కొన్ని సందర్భాల్లో రవి సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తొలుత కరేబియన్ దీవుల్లో.. ఆ తర్వాత అన్ని దేశాల్లోనూ ఐ బొమ్మ రెస్టారెంట్ శాఖల్ని కూడా ఏర్పాటు చేస్తానని.. భారత వంటకాలను ఆయా దేశాల ప్రజలకు అలవాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రూ.80 లక్షలు పెట్టి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్న ఐబొమ్మ రవి.. ఇప్పటివరకు తాను సంపాదించిన రూ.20 కోట్లలో రూ.17 కోట్లు విలాసాలకు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఎంతన్నది సందేహంగా మారింది. పోలీసుల విచారణ నేపథ్యంలో రవి ఖాతాలో ఉన్న రూ.3కోట్లు.. హైదరాబాద్.. విశాఖలో ఉన్న ఆస్తుల్ని సీజ్ చేసిన వైనం తెలిసిందే. త్వరలోనే బెయిల్ వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళలో.. ఐ బొమ్మ రెస్టారెంట్ మాట ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
