Begin typing your search above and press return to search.

ఐబొమ్మ వన్ ను పోలీసులు సరిగా చెక్ చేయలేదా?

అనూహ్యంగా ఐబొమ్మ వన్ పేరుతో ఐబొమ్మ తరహాలోనే తెలుగు సినిమాలు హెచ్ డీ ప్రింట్ తో స్ట్రీమ్ అవుతున్నట్లుగా ప్రచారం మొదలైంది.

By:  Garuda Media   |   21 Nov 2025 9:27 AM IST
ఐబొమ్మ వన్ ను పోలీసులు సరిగా చెక్ చేయలేదా?
X

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఐబొమ్మ వెబ్ సైట్.. దాని నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు.. రిమాండ్.. దీనికి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ.. యూట్యూబ్ చానళ్లలో వస్తున్న రియాక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవి అరెస్టుతో ఐబొమ్మకు బొమ్మ పడిందన్న మాట వినిపించటం.. అందుకు తగ్గట్లే.. తమ సేవల్ని శాశ్వితంగా నిలిపేస్తున్నట్లుగా పేర్కొంటూ ఐబొమ్మ వెబ్ సైట్ లో మెసేజ్ ప్రత్యక్షం కావటం తెలిసిందే.

అనూహ్యంగా ఐబొమ్మ వన్ పేరుతో ఐబొమ్మ తరహాలోనే తెలుగు సినిమాలు హెచ్ డీ ప్రింట్ తో స్ట్రీమ్ అవుతున్నట్లుగా ప్రచారం మొదలైంది. దీనికి తగ్గట్లే.. పలువురు వెబ్ సైట్ ఓపెన్ అవుతుందని.. సినిమాలు స్ట్రీమ్ అవుతున్నట్లుగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా.. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పందిస్తూ.. ఐబొమ్మ వన్ వెబ్ సైట్ ఓపెన్ కావటం లేదని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.

‘‘ఐబొమ్మ వన్ వెబ్ సైట్ లో కొత్త సినిమాలు పైరసీ అయ్యాయన్న ప్రచారంలో వాస్తవం లేదు. అందులో మూవీస్ కు సంబంధించిన రివ్యూస్ మాత్రమే ఉన్నాయి. అది ఓపెన్ చేస్తే.. మూవీ రూల్జ్ కు రీడైరెక్టు అవ్వటం లేదు. ఐబొమ్మ.. బప్పం వెబ్ సైట్లను ఇప్పటికే బ్లాక్ చేయించాం. వేరే వెబ్ సైట్ల ద్వారా పైరసీకి పాల్పడితే.. అందుకు తగ్గట్లే చర్యలు తీసుకుంటాం’’ అంటూ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు.

అయితే.. పోలీసుల ప్రకటనకు భిన్నంగా వాస్తవాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. కొందరు ఐబొమ్మ వన్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయటం.. అందులో పలు సినిమాలు దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు ప్లే అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఐబొమ్మ వన్ అన్నది మూవీ రివ్యూస్ వెబ్ సైట్ అని చెప్పటం కరెక్టు కాదని.. పోలీసులు సరిగా చెక్ చేయకుండానే ప్రకటన చేశారన్న విమర్శ వినిపిస్తోంది. అయితే.. సదరు వెబ్ సైట్ లో ఉన్న సినిమాలు మొత్తం ప్లే కాకున్నా.. కొన్ని మాత్రం అచ్చం ఐబొమ్మ వెబ్ సైట్ లో మాదిరే ప్లే అవుతున్నాయి. ఇదంతా చూస్తున్న వారు.. సైబర్ క్రైం పోలీసులు సైతం తప్పులో కాలేశారన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ వెబ్ సైట్ పై సైబర్ క్రైం పోలీసులు మరోసారి ప్రకటన విడుదల చేయొచ్చన్న మాట వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.