తెలంగాణ పోలీసుల్ని లైట్ తీసుకొని అడ్డంగా దొరికిన ఐబొమ్మ అధినేత
కొత్త సినిమాలు.. ఓటీటీల్లోని కంటెంట్ ను పైరసీ చేస్తూ.. పైరేటెట్ కంటెంట్ చూసే ప్రతి ఒక్కరికి సుపరిచితం ఐబొమ్మ వెబ్ సైట్.
By: Garuda Media | 16 Nov 2025 9:37 AM ISTకొత్త సినిమాలు.. ఓటీటీల్లోని కంటెంట్ ను పైరసీ చేస్తూ.. పైరేటెట్ కంటెంట్ చూసే ప్రతి ఒక్కరికి సుపరిచితం ఐబొమ్మ వెబ్ సైట్. దీని నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి. ఆయనకు చెందిన బప్పం.. ఐ విన్.. బప్పం టీవీ పేర్లతో వెబ్ సైట్ లను రూపొందించి.. ఏడెనిమిదేళ్లుగా పైరసీ సినిమాల్ని.. వెబ్ సీరిస్ లను తన వెబ్ సైట్ లో స్ట్రీమ్ అయ్యేలా చేసే 40 ఏళ్ల ఇమ్మడి రవిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. చివరకు తెలుగు చిత్ర పరిశ్రమ సైతం అతడిపై కంప్లైంట్ చేసిన పరిస్థితి.
తాజాగా అతను కూకట్ పల్లిలో ఉండగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడ్ని బషీర్ బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు తరలించి విచారించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చి.. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు పంపారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నాడు.
ఏపీలోని విశాఖకు చెందిన ఇమ్మడి రవి ఉన్నత విద్యావంతుడే కాదు.. ప్రపంచంలో ఎలాంటి సర్వర్ అయినా.. ఎంతటి సెక్యూరిటీ ఉన్నా హ్యాక్ చేయటంలో దిట్ట అని చెబుతున్నారు. ఇంతటి మేధావి.. తప్పు దారి పట్టాడు. పైరసీ వైపునకు మళ్లిన అతను కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్.. ఓటీటీ వేదికల సర్వర్లను ఇట్టే హ్యాక్ చేసి హెచ్ డీ క్వాలిటీతో సినిమాలు.. వెబ్ సిరీస్ లను డౌన్ లోడ్ చేసేవాడు. కరేబియన్ దీవులు కేంద్రంగా ఉన్న సర్వర్లలో నిక్షిప్తం చేసి తన వెబ్ సైట్ల ద్వారా ఉచితంగా చూసే వీలు కల్పించాడు. దీంతో.. అతి తక్కు వ సమయంలో అతని వెబ్ సైట్ పాపులర్ అయ్యింది.
తెలుగు సినిమాలు.. వెబ్ సిరీస్ లతో పాటు కన్నడ.. తమిళం.. హిందీ.. మలయాళం తదితర భాషలకు చెంిన తెలుగు డబ్బింగ్ తో విడుదలైన వాటిని తన ఐబొమ్మ.. బప్పంలో ఉంచాడు. తానెవరో తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్న అతను.. ఈ మధ్యన అతడు రాసినట్లు ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో హెచ్చరిక టోన్ లో ఉన్న సందేశాన్ని ఉంచాడు. తన వద్ద కోట్ల మంది డేటా ఉందని.. తన వెబ్ సైట్ మీద ఫోకస్ చేయటం అపాలన్న అతడి తీరు సంచలనంగా మారింది.
ఇదే సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగంలోని యాంటీ వీడియో వీడియో పైరసీ సెల్ ఆగస్టు 30న హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు సర్వర్లను హ్యాక్ చేసి డౌన్ లోడ్ చేసుకున్న సినిమాలను పైరసీ ముఠాలకు అమ్ముతున్న ఐదుగురు నిందితుల్ని సెప్టెంబరు 29న అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుడి కోసం వేట షురూ చేశారు.
ఇదిలా ఉండగా తనకున్న సాంకేతిక నైపుణ్యంతో తాను ఎక్కడ ఉన్న విషయాన్ని పోలీసులకు తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్న రవి..తనను పోలీసులు పట్టుకోలేరన్న అతి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. విదేశాల్లో ఉన్న అతడ్ని ట్రాక్ చేసిన పోలీసులు.. తాను ఉన్న ప్రదేశానికి భిన్నంగా వేర్వేరు దేశాల్లో ఉన్నట్లుగా ఏమారుస్తుండే విషయాన్ని గుర్తించారు. తాను పోలీసుల్ని తప్పు దారి పట్టించటంలో సక్సెస్ అవుతున్నట్లుగా భావించిన అతను తాజాగా హైదరాబాద్ కు వచ్చాడు. అయితే.. అతడి కదలికల్ని నిశితంగా గమనిస్తున్న పోలీసులు అతడ్ని కూకట్ పల్లిలోని నివాసంలో అరెస్టు చేశారు. దీంతో.. ఐబొమ్మ నిర్వాహకుడికి హైదరాబాద్ నగర పోలీసులు రియల్ బొమ్మను చూపించారని చెప్పాలి.
