పెళ్లైన రెండేళ్ల వేళ.. ఆ సివిల్ సర్వెంట్ల పెళ్లి వీడియో వైరల్
పెళ్లంటే.. ధనిక, పేద అన్న తేడా లేకుండా లక్షలాది రూపాయిలు ఖర్చు చేసి.. తమ స్తోమతకు మించి ఖర్చు చేయటం కనిపిస్తుంది.
By: Garuda Media | 2 Sept 2025 9:30 AM ISTపెళ్లంటే.. ధనిక, పేద అన్న తేడా లేకుండా లక్షలాది రూపాయిలు ఖర్చు చేసి.. తమ స్తోమతకు మించి ఖర్చు చేయటం కనిపిస్తుంది. పెళ్లికి చేసిన అప్పుతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేందుకు సిద్ధపడతారే తప్పించి.. తగ్గేందుకు మాత్రం అస్సలు ఇష్టపడరు. ఇలాంటి కాలంలో కేవలం రూ.2 వేలతో పెళ్లి చేసుకున్న ఇద్దరు ఐఏఎస్ లు వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ ఇద్దరి ఐఏఎస్ లు పెళ్లి చేసుకొని రెండేళ్లు కావటం. పెళ్లైన రెండేళ్లకు వారి పెళ్లి వీడియో వైరల్ కావటం వెనుకఆసక్తికర ముచ్చటే ఉంది.
తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ మౌనిక.. ఛత్తీస్ గఢ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి యువరాజ్ మర్మత్ లు 2022 బ్యాచ్ కు చెందిన వారు. మౌనిక ఫార్మకాలజీ పూర్తి చేశాక సివిల్స్ పై గురి పెడితే.. రాజస్థాన్ కు చెందిన యువరాజ్ మాత్రం సివిల్ ఇంజనీరింగ్ చేసి.. కొన్నాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జాబ్ చేసిన తర్వాత సివిల్స్ ను టార్గెట్ గా చేసుకున్నారు.
వీరిద్దరూ 2022లో సివిల్స్ ను సాధించిన తర్వాత ట్రైనింగ్ లో భాగంగా ముస్సోరికి వెళ్లటం.. అక్కడి అకాడమీలో మొదలైన వీరి స్నేహం.. ప్రేమగా మారి 2023లో పెళ్లి పీటల మీదకు ఎక్కింది. అయితే.. ఎలాంటి హంగు.. ఆర్భాటం లేకుండా కేవలం రూ.2వేల ఖర్చుతో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. ఇతర ముఖ్యుల మధ్య కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఏర్పాటు చేసిన సింఫుల్ రిసెప్షన్ లో.. పూలదండలు.. మిఠాయిలకు పెట్టిన ఖర్చు అక్షరాల రూ.2 వేలు మాత్రమే.
తాజాగా వారి రెండో వివాహ వార్షికోత్సవ వేడుకలు ప్రైవేటుగా జరుపుకుంటున్న వేళ.. తమ పెళ్లి ముచ్చటను గుర్తు చేసుకున్న వారు.. తమ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పెళ్లి అంటే కమిట్ మెంట్.. కలకాలం తోడు ఉంటామని చేసుకునే ఒకరికొకరు ఇచ్చుకునే మాటే తప్పించి అనవసర ఖర్చు కాదన్నది వీరి భావన. తాము అదే విషయాన్ని తమ చేతలతో ఫ్రూవ్ చేస్తున్నట్లుగా వీరి పోస్టు ఉండటం.. వీరి సింఫుల్ పెళ్లి నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తూ.. పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్ల మనసు దోచిన వీరి పెళ్లి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
