Begin typing your search above and press return to search.

కుక్క కోసం చేసిన పనితో బదిలీ.. మళ్లీ ఢిల్లీకి ఆ ఐఏఎస్!

అవును... పెంపుడు కుక్క కోసం అథ్లెట్లను స్టేడియం నుంచి ఖాళీ చేయించిన వ్యవహారంలో కొన్నేళ్ల క్రితం వార్తల్లో నిలిచిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ మరోసారి వార్తల్లో నిలిచారు.

By:  Raja Ch   |   22 Jan 2026 3:00 PM IST
కుక్క కోసం చేసిన పనితో బదిలీ.. మళ్లీ ఢిల్లీకి ఆ ఐఏఎస్!
X

గతంలో ఓ ఐఏఎస్ అధికారి తన పెంపుడు కుక్క కోసం చేసిన పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.. ఇందులో భాగంగా.. కుక్కతో వాకింగ్ కోసం అథ్లెట్లను స్టేడియం నుంచి ముందే పంపించేశారట.. దీనిపై మీడియాలో కథనాలు వైరల్ గా మారాయి.. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.. ఆయనను బదిలీ చేసింది.. ఆయన భార్యను బలవంతంగా ఉద్యోగం నుంచి పంపిందని అంటారు. కట్ చేస్తే... సదరు ఐఏఎస్ కు మళ్లీ ఢిల్లీలోనే కీలక పోస్ట్ దక్కింది.

అవును... పెంపుడు కుక్క కోసం అథ్లెట్లను స్టేడియం నుంచి ఖాళీ చేయించిన వ్యవహారంలో కొన్నేళ్ల క్రితం వార్తల్లో నిలిచిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఢిల్లీ కొత్త మున్సిపల్ కమిషనర్ గా నియమితులయ్యారు. కుక్క వాకింగ్ వివాదం కారణంగా ఆయనను రాజధాని నుండి బయటకు తరలించిన మూడు సంవత్సరాల తర్వాత.. మళ్లీ కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం వచ్చింది!

1994 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన సంజీవ్ ఖిర్వార్.. భార్య రింకూ దుగ్గా కూడా విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఈ ఐఏఎస్‌ జంట తమ పెంపుడు కుక్కతో వాకింగ్‌ చేసేందుకు ఢిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియంను వివాదాస్పదంగా ఉపయోగించుకుందని 2022లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వీరి ఆదేశాల మేరకు స్టేడియం నిర్వాహకులు నిర్ణీత సమయం కంటే ముందే క్రీడాకారులను బయటకు వెళ్లగొట్టేవారని మీడియాలో విపరీతంగా కథనాలొచ్చాయి.

అలా అథ్లెట్లను పంపించేసిన తర్వాత ఈ భార్యాభర్తలైన అధికారులిద్దరూ పెంపుడు కుక్కతో అక్కడికి చేరుకొని వాకింగ్‌ చేసేవారు. ఆ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భార్యాభర్తలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది. తర్వాత రింకూను బలవంతంగా ఉద్యోగం నుంచి సాగనంపింది! అప్పట్లో ఈ విషయం అటు ఆఫ్ లైన్ లోనూ, ఆన్ లైన్ లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే.. దీనిపై స్పందించిన త్యాగరాజ్ స్టేడియం నిర్వాహకుడు.. అథ్లెట్లు శిక్షణ పొందేందుకు అధికారిక సమయం సాయంత్రం 7 గంటల వరకు ఉందని.. ఆ తర్వాత కోచ్‌ లు, అథ్లెట్లు వెళ్లిపోతారని అన్నారు. ఇదే సమయంలో.. ఖిర్వార్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. అయితే.. అథ్లెట్లు సాధారణంగా రాత్రి 8.30 గంటల వరకు శిక్షణ పొందేవారని.. కానీ అందుకు అంతరాయం కలిగిస్తూ సాయంత్రం 7 గంటలకల్లా శిక్షణను ముగించాల్సి వచ్చిందనే విషయం వెలుగులోకి వచ్చింది!

ఈ నేపథ్యంలోనే... అప్పుడు సంజీవ్‌ ను లద్దాఖ్‌ కు బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో తాజాగా ఆయన్ను వెనక్కి రప్పించింది. ప్రస్తుతం పాలనాపరంగా, ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని చెబుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కి కమిషనర్ గా నియమించింది. కాగా.. ఎంసీడీ త్వరలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో సంజీవ్ నియామకం జరిగింది.