Begin typing your search above and press return to search.

పాక్ చేతికి చైనా 5వ జెన్ విమానాలు.. భారత్ కు ఆందోళన.. మనకు ఎప్పటికి?

భారత వాయుసేనలో ప్రస్తుతం తీవ్రంగా వేధిస్తున్న ఫైటర్ జెట్ల కొరతపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

By:  A.N.Kumar   |   4 Oct 2026 12:19 PM IST
పాక్ చేతికి చైనా 5వ జెన్ విమానాలు.. భారత్ కు ఆందోళన.. మనకు ఎప్పటికి?
X

కొద్దికాలంగా భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక ఆధిపత్యం సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైనా తయారు చేస్తున్న ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాలను పాకిస్తాన్‌ కొనుగోలు చేయడం భారత్‌‌కు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని స్పష్టం చేశారు. దేశ సరిహద్దు భద్రత దృష్ట్యా ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లు, వాయుసేన కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై ఐఏఎఫ్ చీఫ్ సమగ్రంగా మాట్లాడారు.

భారత వాయుసేనలో ప్రస్తుతం తీవ్రంగా వేధిస్తున్న ఫైటర్ జెట్ల కొరతపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. దేశ భద్రతా అవసరాల ప్రకారం వాయుసేన వద్ద కనీసం 42 ఫైటర్ స్క్వాడ్రన్లు ఉండాల్సి ఉండగా మిగ్-21 విమానాలను దశలవారీగా తొలగించడం వల్ల ప్రస్తుతం ఈ సంఖ్య కేవలం 29 స్క్వాడ్రన్లకు పడిపోయిందని తెలిపారు. ఒక్కో స్క్వాడ్రన్‌లో 18 యుద్ధ విమానాలు ఉంటాయని పేర్కొన్న ఆయన రాబోయే రోజుల్లో స్క్వాడ్రన్ల సంఖ్య మరింత తగ్గిపోకుండా చూడాలంటే భారత్ ప్రతి ఏటా 36 నుండి 40 కొత్త యుద్ధ విమానాలను, అంటే సుమారు రెండు స్క్వాడ్రన్లను వాయుసేనలో చేర్చుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఉన్న లోటును భర్తీ చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు సరిపడా అదనపు విమానాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫైటర్ జెట్ల కొరతను అధిగమించడానికి బహుళ రకాల ప్రాజెక్టులపై భారత్ దృష్టి సారించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడించారు. 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఖరారయ్యే అవకాశం ఉందన్న ఆయన ప్రస్తుతం ధరతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. దీంతో పాటు స్వదేశీ రక్షణ ఉత్పత్తులైన తేజస్ ఎంకే-1ఏ, తేజస్ ఎంకే-2 , ఐదో తరం తేలికపాటి విమానం ఆమ్కా ప్రాజెక్ట్‌లు వాయుసేనకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అదే సమయంలో రష్యా నుంచి ఐదో తరం ఎస్.యూ-57 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే అంశంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని.. సామర్థ్యం, ఇతర ప్రత్యామ్నాయాలను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

రక్షణ రంగ ప్రాజెక్టులలో జరుగుతున్న జాప్యంపై ఐఏఎఫ్ చీఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక అభివృద్ధి, ఉత్పత్తి ప్రక్రియలు సుదీర్ఘకాలం సాగితే అప్పటికే ప్రత్యర్థి దేశాలు అదే సాంకేతికతను అధిగమించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా "టెక్నికల్ డిలే అంటే టెక్నాలజీని తిరస్కరించడమే" అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు పాకిస్తాన్-చైనా మధ్య పెరుగుతున్న సైనిక సహకారాన్ని భారత్ నిశితంగా గమనిస్తోందని.. అయితే కొత్తగా కొనుగోలు చేసే ఐదో తరం విమానాలను పాకిస్తాన్ తన వద్ద ఉన్న పాత యుద్ధ వ్యవస్థలతో సరిగ్గా అనుసంధానించుకోలేకపోతే వాటి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించడం కష్టమవుతుందని విశ్లేషించారు. భవిష్యత్ యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్స్, అంతరిక్ష ఆధారిత వైమానిక సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతూ ప్రత్యేక డ్రోన్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కంటే ఉన్న సైనిక వ్యవస్థల్లోకే డ్రోన్లను సమర్థంగా అనుసంధానించడమే ఐఏఎఫ్ ప్రధాన వ్యూహమని వివరించారు.