Begin typing your search above and press return to search.

రావల్పిండి చికెన్ టిక్కా.. ముజఫరాబాద్ కుల్ఫీ ఫలూదా.. ఎయిర్ ఫోర్సు డే డిన్నర్ మెనూ వైరల్

భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన డిన్నర్ మెనూ వైరల్ అవుతోంది.

By:  Tupaki Political Desk   |   9 Oct 2025 4:36 PM IST
రావల్పిండి చికెన్ టిక్కా.. ముజఫరాబాద్ కుల్ఫీ ఫలూదా.. ఎయిర్ ఫోర్సు డే డిన్నర్ మెనూ వైరల్
X

భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన డిన్నర్ మెనూ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మెనూ కార్డు సోషల్ మీడియాలో విస్త్రుతంగా షేర్ చేస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఇటీవల పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పలు ఉగ్రశిబిరాలపై మన దళాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నాటి దాడుల్లో ముఖ్యమైన లక్ష్యాలను గుర్తు చేసేలా డిన్నర్ లో వడ్డించిన పలు ఆహార పదార్థాలకు పేర్లు పెట్టారు.

రావల్పిండి చికెన్ టిక్కా.. ముజఫరాబాద్ కుల్ఫీ ఫలూదా వంటి ఉగ్ర శిబిరాల పేర్లతో వంటలు తయారు చేశారు. అంతేకాకుండా ఆయా వంటల పేర్లతో ఒక ఆహ్వాన పత్రం ముద్రించి సైనికాధికారులకు పంపించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా ఎక్స్ లో దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ ఫొటోకు నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెనూ కార్డులో ‘93 సంవత్సరాల ఐఏఎఫ్.. తప్పుపట్టలేని, అపారమైన కచ్చితమైనది’ అనే టైటిల్ తో ముద్రించారు.

ఇక ఆ మెనూలో పాకిస్థాన్ నగరాలు, పాక్ ఆక్రమిత ప్రాంతాల పేర్లతో వంటకాలను తయారు చేసినట్లు పేర్కొన్నారు. రావల్పిండి చికెన్ టిక్కా మసాలా, రఫీకీ రహ్రా మటన్, భోలారి పనీర్ మేతి మలై, సుక్కుర్ షామ్ సవేరా కోఫ్తా, సర్గోధా దాల్ మఖానీ, జాకోబాబాద్ మేవా పులావ్, బహవల్పుర్ నాన్, ఇక డెజర్టల విషయానికొస్తే బాలకోట్ తిరమిసు, ముజఫరాబాద్ కుల్ఫీ ఫలూదా, ముర్కిదే మీతా పాన్ ఉన్నాయి. ఇవన్నీ పాకిస్థాన్ తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాడులు చేసిన ప్రాంతాలే కావడం విశేషం.

రావల్పిండి పాకిస్థాన్ లోని ప్రధాన సైనిక స్థావరం, ఆ దేశంలో సైనిక కార్యకలాపాలకు రావల్పిండి కేంద్రం. ఇస్లామాబాద్ పక్కనే ఉన్న ఈ నగరం ఆర్థిక, రవాణా పరంగా కీలకంగా చెబుతారు. ఇక రావల్పిండి సమీపంలో నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న సందర్భాల్లో ఈ ప్రాంతంలోని సైనిక స్థావరాలు వార్తలలో నిలుస్తాయి. అదేవిధంగా సుక్కుర్, జాకోబాబాద్ సింధ్ ప్రావిన్స్ లో ఉంటాయి. సర్గోధా, బహవల్పూర్ పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నాయి. బాలాకోట్ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్ లో ఉండగా, ముజఫరాబాద్ ఆక్రమిత కాశ్మీర్ లో భాగంగా చెబుతున్నారు.