Begin typing your search above and press return to search.

రోటీన్ కు భిన్నంగా ఐబొమ్మ రవి లైఫ్

రవిని అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసుల దర్యాఫ్తులోనూ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.

By:  Garuda Media   |   20 Nov 2025 11:36 AM IST
రోటీన్ కు భిన్నంగా ఐబొమ్మ రవి లైఫ్
X

‘ఐ బొమ్మ’ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి వ్యక్తిగత జీవితం.. అతడి జీవనశైలి.. తదితర అంశాలపై వెలుగు చూస్తున్న అంశాలు ఇప్పుడు అతడిపై మరింత చర్చకు తెర తీస్తున్నాయి. ఓవైపు సినీ పరిశ్రమ ఐబొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నందుకు పోలీసులకు వరుస పెట్టి థ్యాంక్స్ చెబుతుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో అతడికి అనుకూలంగా పోస్టులు.. చర్చలు షురూ కావటమే కాదు.. పలువురు రవికి మద్దతుగా సినిమా క్లిప్పులతో వీడియోలు తయారు చేస్తూ విడుదల చేస్తున్నారు.

రవిని అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసుల దర్యాఫ్తులోనూ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వైవిహిక జీవితంలో ఎదురైన పరిస్థితులు అతడ్ని పూర్తిగా మార్చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. అతడ్ని అరెస్టు చేసే సమయంలో కూకట్ పల్లిలోని రెయిన్ బో విస్టాలో అతడి నివాసాన్ని చూసిన పోలీసు అధికారులు షాక్ తిన్నట్లు చెబుతున్నారు. ఇల్లంతా చిందరవందరగా ఉండటం.. దుమ్ము ధూళి కొట్టుకుపోవటం లాంటివి గమనించారు. రెండు నెలలకో దేశం తిరిగినా తప్పనిసరిగా ఇంటికి చేరేవాడని తెలుస్తోంది.

అంతేకాదు.. వైవాహిక జీవితం సరిగా సాగకపోవటం.. భార్య విడిచి వెళ్లిపోవటంతో మనుషులపై నమ్మకం సన్నగిల్లిందని.. ఆ కారణంగానే పని మనుషుల్ని పెట్టుకోలేదని తెలుస్తోంది. అరెస్టు నేపథ్యంలో పలువురు న్యాయవాదులు అతడికి న్యాయ సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నా.. ఎవరికి అందుబాటులోకి రావటం లేదని.. అతను ఒక్కరిని మాత్రమే నమ్ముతాడని.. అతడి ద్వారానే లాయర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం.

అతడి సెల్ ఫోన్ లోని నెంబర్లను చూసినప్పుడు కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఇంటికి స్మార్ట్ డోర్ లాక్ పెట్టుకోవటం.. దానికున్న కెమెరా అమర్చి ఉండటం ద్వారా.. బయటి వ్యక్తులు ఎవరు వచ్చినా ముందుగా కెమెరా ద్వారా తెలుసుకున్న తర్వాతే తలుపులు తీసేవాడని తెలుస్తోంది. పోలీసుల తనిఖీ సమయంలోనే సీక్రెట్ కెమెరాతో పసిగట్టి.. దాదాపు రెండు గంటల పాటు తలుపు తీయకుండా ఉండటం తెలిసిందే. ఆ సమయంలోనే తన ల్యాప్ టాప్.. ఫోన్ లో సమాచారాన్ని తీసేసి ఉంటారని తెలుస్తోంది.

అమీర్ పేటలోని కోచింగ్ సెంటర్ లో యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఏడాది పాటు సంతోషంగా ఉన్నప్పటికి దంపతుల మధ్య ఆర్థిక ఇబ్బందులు వారి వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టాయి. వీరు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వేళలో వారు విడిపోయినట్లుగా గుర్తించారు. కూతుర్ని భార్య తీసుకెళ్లిపోవటంతో ఒంటరి అయ్యాడు. దీంతో.. గేమింగ్.. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు.. విదేశాలకు తిరుగుతూ ఉండేవాడని తెలుస్తోంది. వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు అతడి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.