Begin typing your search above and press return to search.

కేజీ రూ.కోటి.. మహా డేంజర్ ఈ హైడ్రోపోనిక్ గంజాయి

మారిన కాలానికి తగ్గట్లే సరికొత్త దారుణాలకు, దరిద్రపుగొట్టు వేషాలకు సైతం కొత్త పద్దతులు తగలడతాయి.

By:  Garuda Media   |   27 Oct 2025 12:51 PM IST
కేజీ రూ.కోటి.. మహా డేంజర్ ఈ హైడ్రోపోనిక్ గంజాయి
X

మారిన కాలానికి తగ్గట్లే సరికొత్త దారుణాలకు, దరిద్రపుగొట్టు వేషాలకు సైతం కొత్త పద్దతులు తగలడతాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకే వస్తుంది. గంజాయి సాగు గురించి అందరికి తెలిసిందే. చట్టవిరుద్ధమైన ఈ సాగు ఎంత డేంజర్ అన్నది తెలిసిందే. మారిన కాలానికి తగ్గట్లు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని.. పెద్దగా ప్లేస్ అవసరం లేకుండా.. ల్యాబుల్లో భారీగా పెంచే హైడ్రోపోనిక్ గంజాయి ఇప్పుడు చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేజీ అక్షరాల కోటి రూపాయిలు పలికే మార్కెట్ ధర పుణ్యమా అని.. ఈ దరిద్రపుగొట్టు గంజాయి సాగు మీద తప్పు దారి పట్టిన పలువురు సాగు చేస్తున్నారు. గ్రాము పది వేలు.. అంటే కేజీ కోటి రూపాయిల ధర పలికే ఈ గంజాయి ప్రత్యేకత ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. షాకింగ్ అంశాలు వెలుగు చూస్తాయి.

నిజానికి కొన్నేళ్ల క్రితం వరకు దీని గురించి పెద్దగా ఎవరికి తెలీదు. తెలుగులో తీసిన మత్తు వదలరా మూవీలో ఈసాగు విధానం గురించి షాకింగ్ నిజాల్ని చూపించటం ద్వారా.. అందరికి తెలిసేలా చేసింది. ఇంతకూ ఈ గంజాకు ఎందుకింత ధర అంటే.. అదిచ్చే మత్తే అందుకు కారణమని చెబుతున్నారు. సాధారణంగా గంజాయిని పొలాల్లో.. మట్టి నేలల్లో పండిస్తారు. అందుకు భిన్నంగా హైడ్రోపోనిక్ గంజాయిని ల్యాబ్ ల్లో సాగు చేస్తారు.

ప్రత్యేక ల్యాబ్స్ లో పరిమిత ఉష్ణోగ్రత.. తేమల మధ్య ఘాటైన గంజా పెరుగుదలకు అవసరమైన కొన్ని పోషకాలతో దీన్ని సాగు చేస్తుంటారు. సాధారణ గంజాయి మొక్కలతో పోలిస్తే ఈ హైడ్రోపోనిక్ ఎదుగుదల చాలా వేగంగా ఉంటుందని చెబుతారు. పంట త్వరగా చేతికి రావటమే కాదు.. భారీ ఆదాయానికి మార్గంగా ఉండటంతో కొందరు దురాశతో దీన్ని సాగు చేసే ట్రాప్ లో చిక్కుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఈ హైడ్రోపోనిక్ గంజా ఇచ్చే మత్తు భారీగా ఉంటుందని.. ఇందులోని టీహెచ్ సీ - టెట్రాహైడ్రోకానబినాల్ మత్తును ఇస్తుంది. సాధారణ గంజాయితో పోలిస్తే హైడ్రోపోనిక్ గంజాయిలో టీహెచ్ సీ 30 శాతం అధికంగా ఉండటంతో మత్తు ఎక్కువగా ఉంటుంది. ఈ గంజాయితోనే హాష్ఆయిల్.. హాషిష్ ను తయారు చేస్తుంటారు. అధిరక టీహెచ్ సీ శాతం ఉండే హైడ్రోపోనిక్ గంజాయి మొక్కల నుంచి తీసే హాష్ ఆయిల్.. హాషిస్ మత్తు ఎక్కువగా ఉండటంతో పాటు.. దీని ఖరీదు కూడా కిక్ ఎక్కించేలా ఉండటంతో ఈ దుర్మార్గపు బాట పట్టిన పలువురు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా గంజాయిని భారీగా పట్టుకుంటున్నారు పోలీసులు.