కూల్చివేతలే కాదు హైడ్రా ఇలా కూడా చేస్తుంది బాస్
అదే విధంగా న్యాయం చేసే క్రమంలో జరిగే కొన్ని లోటుపాట్లు చేసిన మంచిని సైతం ఖరాబు చేస్తుంటాయి. అయితే.. ఇందుకు భిన్నంగా వ్యవహరించింది హైడ్రా.
By: Garuda Media | 2 Nov 2025 5:23 PM ISTకీలక స్థానాల్లో ఉండే వారు విమర్శలకు అతీతంగా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. అదే విధంగా న్యాయం చేసే క్రమంలో జరిగే కొన్ని లోటుపాట్లు చేసిన మంచిని సైతం ఖరాబు చేస్తుంటాయి. అయితే.. ఇందుకు భిన్నంగా వ్యవహరించింది హైడ్రా. మొదట్లో హైడ్రా వేసిన తప్పటడుగుల్ని కాసేపు పక్కన పెడితే.. ఇటీవల కాలంలో ఆ సంస్థ చేస్తున్న పనులు విమర్శకులు సైతం ప్రశంసించే పరిస్థితి. ప్రభుత్వ భూములు.. చెరువులు.. కుంటలు.. నాలాలు అక్రమించే వారికి చుక్కలు చూపిస్తున్న వైనం..గతంలో హైడ్రాకు జరిగిన డ్యామేజ్ ను భర్తీ చేస్తూ అంతకంతకూ దాని ఇమేజ్ పెరుగుతోంది. శనివారం అమీన్ పూర్ (చందానగర్ సరిహద్దుల్లో ఉంటుంది. సాంకేతికంగా మెదక్ జిల్లా పరిధిలోకి వస్తుంది) లో ఒక భారీ అపార్ట్ మెంట్ భవనాన్ని కూల్చేసిన (?) వైనం చూసినప్పుడు.. హైడ్రా కమిట్ మెంట్ ఎంత పక్కాగా ఉందన్నది అర్థమవుతుంది.
అంతేకాదు.. జరిగిన తప్పును ఒప్పు చేసే క్రమంలో దూకుడు ప్రదర్శించకుండా.. విమర్శలకు తావివ్వని వైనం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇదేమీ మీడియా ఫోకస్ కాకపోవటం నిజంగానే దాని బ్యాడ్ లక్ గా చెప్పాలి. విషయాన్ని సూటిగా.. సింఫుల్ గా చెప్పాలంటే.. ఒక బిల్డర్ అతని భాగస్వాములు ఐదు అంతస్తుల అపార్ట్ మెంట్ నిర్మించారు. అయితే.. అందులో కొంత ప్రభుత్వ భూమి.. మరికొంత బిల్డర్ సొంతభూమి ఉంది. అంటే.. నిర్మాణదారు తన సొంత భూమితో పాటు ప్రభుత్వ భూమిని అక్రమించుకొని ఐదు అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా.. ఐదు అంతస్తుల్లో నిర్మించిన అపార్టు మెంట్ లో కొంత భాగం ప్రభుత్వ భూమిని అక్రమించి నిర్మించినట్లుగా గుర్తించారు. అన్ని రికార్డుల్ని పక్కాగా సేకరించి.. వారు చేసింది తప్పన్న విషయాన్ని గుర్తించి..శనివారం ఉదయం బాహుబలి క్రేన్ ను తీసుకొచ్చి కూల్చివేతలు చేపట్టారు. ఇక్కడే హైడ్రాను ప్రత్యేకంగా అభినందించాలి.
తాను చట్టబద్ధంగా వ్యవహరిస్తానన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. ప్రభుత్వ భూమిలో నిర్మించిన అపార్టుమెంట్ భాగాన్ని కూల్చేశారు. అంటే.. మొత్తంఅపార్టుమెంట్ ను కూల్చలేదు. కేవలం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కొన్ని టూ బీహెచ్ కే.. కొన్ని త్రీ బీహెచ్ కేలను మాత్రమే కూల్చేశారు. మిగిలిన భవనాన్ని అలానే ఉంచేశారు. అంటే.. ఐదు అంతస్తుల అపార్టుమెంట్ ను ప్రభుత్వ స్థలంలో ఉన్న భాగాన్ని కూల్చేసి.. మిగిలిన భాగాన్ని అలానే వదిలేశారు. ఇంత జాగ్రత్తగా వ్యవహరించటం నిజంగానే అభినందనీయం.
అక్రమ నిర్మాణం పేరుతో అడ్డగోలుగా కూల్చివేతలు చేపట్టకుండా.. ఎవరూ వేలెత్తి చూపని రీతిలో వ్యవహరించారు. బ్యాడ్ లక్ ఏమంటే.. తెలుగు మీడియాలో ఒకరిద్దరు మినహా.. మిగిలిన వారంతా కూడా ఐదు అంతస్తుల అపార్టుమెంట్ భవనాన్ని హైడ్రా కూల్చేసిందని వార్తలు ఇవ్వటం గమనార్హం. ఇటీవల కాలంలో హైడ్రా చాలానే నిర్మాణాల్ని కూల్చేసింది. అయితే.. తాజా ఉదంతం మాత్రం రోటీన్ కు భిన్నమైనది. మామూలుగా అయితే ఇలాంటి విషయాల్ని ప్రత్యేకంగా పేర్కొంటూ మీడియాలో వార్తలు ఇవ్వాలి. అందుకు భిన్నంగా హైడ్రా కూల్చివేతలంటూ నిజాన్ని పక్కన పెట్టేసినట్లుగా వార్తలు ఇవ్వటం చూస్తే.. సున్నితత్వాన్ని మిస్ అవుతున్నామా? అన్న భావన కలుగక మానదు.
