Begin typing your search above and press return to search.

హైడ్రా విష స‌ర్పం: పొలిటిక‌ల్‌ మాట‌ల మంట‌లు!

హైడ్రాపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను త‌క్ష‌ణ‌మే క‌మిష‌న‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ఆదేశించ‌డంతో ఈ వ్య‌వ‌హారం అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారి తీసింది.

By:  Garuda Media   |   30 July 2026 12:42 AM IST
హైడ్రా విష స‌ర్పం: పొలిటిక‌ల్‌ మాట‌ల మంట‌లు!
X

తెలంగాణ రాజ‌కీయాల్లో హైడ్రా వ్య‌వ‌హారం తీవ్ర‌స్థాయిలో దుమారం రేపుతోంది. హైడ్రాపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను త‌క్ష‌ణ‌మే క‌మిష‌న‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ఆదేశించ‌డంతో ఈ వ్య‌వ‌హారం అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారి తీసింది. ఏక‌కాలంలో ఢిల్లీ ప‌ర్య‌టన‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు కేటీఆర్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను స‌మ‌ర్థించ‌గా.. బీఆర్ ఎస్ దీనిని తీవ్రంగా వ్య‌తిరేకించింది. పైగా హైడ్రాను తాము అధికారంలోకి వ‌చ్చాక ర‌ద్దు చేస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

హైడ్రా వ్య‌వ‌స్థ‌ను అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని కేటీఆర్ ఆరోపించారు. కానీ, వాస్త‌వానికి హైడ్రా తొమ్మిది త‌ల‌ల విష వృక్ష‌మ‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని తాము చెప్ప‌డం లేద‌ని హైకోర్టే ఇటీవ‌ల వ్యాఖ్యానిం చింద‌ని అన్నారు. దీనిని ప్ర‌త్య‌ర్థుల‌పై ప్ర‌యోగించి క‌క్ష సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ సాధ‌నంగా వినియోగించు కుంటున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. కేవ‌లం విప‌క్ష పార్టీనాయ‌కులు, మ‌ద్ద‌తు దారుల‌కు చెందిన ఇళ్ల‌పైనే హైడ్రా కూల్చివేత ల ప‌ర్వం కొన‌సాగించింద‌న్నారు. దీనిని బుద్ధి ఉన్న‌వారు ఎవ‌రూ స‌మ‌ర్ధించ‌ర‌ని ప‌రోక్షంగా రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, రేవంత్ సైతం అంతే దూకుడుగా వ్యాఖ్యానించారు. హైడ్రా కొన‌సాగుతుంద‌ని.. దీనిని మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. క‌బ్జాకోరులు.. కోర్టుల‌ను ఆశ్ర‌యించి.. త‌ప్పుడు పిటిష‌న్లు వేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు ప్ర‌భుత్వానికి చెంప‌పెట్టు అన్న కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టారు. గ‌తంలో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కోర్టులు అనేక తీర్పులు ఇచ్చాయ‌ని.. వాటిపై చ‌ర్చ‌కు వ‌స్తారా? అని ప్ర‌శ్నించారు. ఇక‌, మంత్రుల ఆక్ర‌మ‌ణ‌ల‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా త‌ప్పుబ‌ట్టారు. మంత్రులైనా.. ఎవ‌రైనా హైడ్రాకు ఒక్క‌టేన‌న్నారు. ఎవ‌రు ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మించుకున్నా.. కుంట‌లు, చెరువుల‌ను ఆక్ర‌మించుకున్నా హైడ్రా త‌న ప‌నితాను చేసుకుపోతుంద‌న్నారు.

ఏం జ‌రుగుతుంది?

ప్ర‌స్తుతం హైడ్రా విష‌యంలో జ‌రుగుతున్న ఈ రాజ‌కీయాలు ఎటు దారితీస్తాయ‌న్నది ఆస‌క్తిగా మారింది. హైకోర్టు ఆదేశాల పై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. మ‌రోవైపు.. సుప్రీంకోర్టులో బీఆర్ ఎస్ ఇంప్లీడ్ కానుంద‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. ఇదేస‌మ‌యంలో హైడ్రాకు వ్య‌తిరేకంగా క్షేత్ర‌స్థాయిలో బీఆర్ ఎస్‌, అనుకూలంగా కాంగ్రెస్ పార్టీలు కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై కూడా దృష్టి పెట్టాయి. రంగ‌నాథ్‌ను తొల‌గించాల‌న్న హైకోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డాన్ని బీఆర్ ఎస్ ప్ర‌శ్నించింది. దీనిపై మ‌రోసారి కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇలా.. హైడ్రా వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల్లో తాజా హాట్ టాపిక్ కావ‌డం గ‌మ‌నార్హం.