రంగనాథ్ సార్.. ఎందుకిలా చేస్తున్నారు?
కీలక పదవుల్లో ఉన్నోళ్లు తాము చేసే పనుల్ని బాగా చేస్తున్నట్లుగా తమను తాము నమ్ముకోవటం బాగానే ఉంటుంది.
By: Garuda Media | 28 Nov 2025 10:29 AM ISTకీలక పదవుల్లో ఉన్నోళ్లు తాము చేసే పనుల్ని బాగా చేస్తున్నట్లుగా తమను తాము నమ్ముకోవటం బాగానే ఉంటుంది. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతుంటే వెంటనే స్పందించటం.. తాను చేస్తున్న పనుల్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నతాధికారికి లభించిన ప్రచారం.. ఫేమ్ మరెవరికీ దక్కలేదనే చెప్పాలి. ఆయనే ఐపీఎస్ అధికారి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రాకు కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన తీరుపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. కొందరు ఆయన తీరును అభినందిస్తుంటే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
సామాన్య ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెడితే.. హైడ్రా తీసుకుంటున్ననిర్ణయాలు.. చేస్తున్న చర్యల విషయంపై తెలంగాణ హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. కోర్టు నిర్ణయాలు.. ఆదేశాల్ని బేఖాతరు చేసినట్లుగా పేర్కొంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇలాంటి సందర్భాల్లో హైకోర్టు ఆదేశాలేమిట? హైడ్రా కమిషనర్ హోదాలో తానేం చేయాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాల్నితీసుకుంటున్నారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. ఆయనపై ప్రదర్శించిన ఆగ్రహం విషయానికి వస్తే.. బతుకమ్మకుంట వివాదంలో డిసెంబరు 5వ తేదీ లోపు హైకోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని కోర్టు నిర్ణయ తీసుకుంది. ఒకవేళ తాము చెప్పినట్లుగా స్పందిచకుంటే.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. బతుకమ్మకుంటలోని ప్రైవేటు స్థలంపై హైకోర్టులో పిటిషన్ దాఖలుకాగా.. ఈ ప్రైవేటు స్థలంలో ఎలాంటి మార్పులు.. చేర్పులు చేయొద్దంటూఈ ఏడాది జూన్ 12న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ ఉల్లంఘించినట్లుగా పేర్కొంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ ప్రైవేటు స్థలంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏవీ రంగనాథ్ కు సూచన చేసింది. అంతేకాదు.. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికి హైడ్రా కమిషనర్ కోర్టుకు హాజరుకాకపోవట హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రంగనాథ్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు చర్చగా మారింది.
