వాట్సాప్ గ్రూప్‌లో చేర్చలేదని పోలీసులను ఆశ్రయించిన మహిళ.. హైదరాబాద్‌లో విచిత్ర ఘటన
మహిళ కేసు పెట్టేందుకు రాగా.. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ఈ విషయంలో కేసు పెట్టడం సాధ్యం కాదని తెలిసి వారిద్దరిని పిలిపి మాట్లాడారు.
By: A.N.Kumar | 27 Jun 2026 7:00 PM ISTసాధారణంగా పోలీస్ స్టేషన్లలో భూ వివాదాలు, దొంగతనాలు, కుటుంబ కలహాలు లేదా సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను చూస్తుంటాం. కానీ హైదరాబాద్‌లో ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తనను వాట్సాప్ గ్రూప్‌లో తిరిగి చేర్చాలంటూ ఒక మహిళ ఏకంగా పోలీసులను ఆశ్రయించిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వింత ఉదంతం హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్ పరిధిలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
బంజారాహిల్స్ రోడ్ నంబర్-12 లోని ఎన్బీటీ నగర్ నివాసితుల కోసం స్థానికంగా ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. బస్తీలోని పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి, విద్యుత్ దీపాలు వంటి నిత్యావసర ప్రజా సమస్యలపై చర్చించుకునేందుకు, సమాచారాన్ని పంచుకునేందుకు ఈ గ్రూప్ వేదికగా మారింది. మొదట్లో అంతా బాగానే సాగింది. సభ్యులంతా బస్తీ అభివృద్ధి గురించే చర్చించేవారు.
అయితే కాలక్రమేణా గ్రూప్‌లోని కొందరు సభ్యులు స్థానిక సమస్యలను పక్కనబెట్టి, రాజకీయాలకు సంబంధించిన పోస్టులు, ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ప్రారంభించారు. ఇది కాస్తా గ్రూప్ సభ్యుల మధ్య వాదోపవాదాలకు దారితీసింది. గ్రూప్ యొక్క అసలు ఉద్దేశం దెబ్బతింటోందని గమనించిన గ్రూప్ అడ్మిన్, సభ్యులందరికీ ఒక కఠినమైన నియమాన్ని పెట్టాడు. ఇకపై గ్రూప్‌లో ఎలాంటి రాజకీయ పోస్టులు పెట్టకూడదని గట్టిగా హెచ్చరించాడు.
రూల్స్ బ్రేక్.. గ్రూప్ నుంచి రిమూవ్
అడ్మిన్ హెచ్చరించినప్పటికీ సదరు మహిళ గ్రూప్ నిబంధనలను బేఖాతరు చేస్తూ వరుసగా రాజకీయ సందేశాలను పోస్ట్ చేస్తూనే వచ్చింది. దీంతో విసిగిపోయిన అడ్మిన్, గ్రూప్ నియమాలను ఉల్లంఘించినందుకు గానూ ఆమెను గ్రూప్ నుండి తొలగించాడు.
గ్రూప్ నుంచి బయటకు పంపేయడంతో సదరు మహిళ తీవ్రంగా హర్ట్ అయ్యింది. తనను మళ్లీ గ్రూప్‌లో చేర్చాలని ఆమె అడ్మిన్‌ను పలుమార్లు కోరింది. కానీ అడ్మిన్ అందుకు నిరాకరించాడు. దీనిని ఒక అవమానంగా భావించిన సదరు మహిళ, తనను గ్రూప్ నుంచి తొలగించి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఏకంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు వివరించింది. కేసు పెట్టాలని కోరింది. ఉద్దేశపూర్వకంగానే తనను గ్రూప్ నుంచి తొలగించారని సదరు మహిళ విన్నవించింది.
పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ
మహిళ కేసు పెట్టేందుకు రాగా.. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ఈ విషయంలో కేసు పెట్టడం సాధ్యం కాదని తెలిసి వారిద్దరిని పిలిపి మాట్లాడారు. గ్రూప్ అడ్మిన్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల వాదనలను విన్నారు. అయితే అడ్మిన్ మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. గ్రూప్ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఆమెను తొలగించానని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను తిరిగి గ్రూప్‌లోకి చేర్చుకునే ప్రసక్తే లేదని పోలీసుల ముందే స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వింత సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేయలేదు. సయోధ్యకు ప్రయత్నించారు. ఈ వాట్సాప్ గొడవపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.
వాట్సాప్ గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ లాంటిది. అందులో ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలనే పూర్తి హక్కులు, అధికారాలు గ్రూప్ క్రియేటర్ లేదా అడ్మిన్‌కు మాత్రమే ఉంటాయి. నిబంధనలు నచ్చకపోతే గ్రూప్ నుండి తొలగించే హక్కు అడ్మిన్‌కు చట్టపరంగా కూడా ఉంటుంది. దీనిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లడం.. కేసు పెట్టాలనడం అవివేకం అని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ విచిత్ర ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. "గ్రూప్ అడ్మిన్ల పవర్స్ ఏంటో ఇప్పుడు తెలిసింది" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా చిన్న వాట్సాప్ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
