అర్థరాత్రి జూబ్లీహిల్స్ లో బీభత్సం.. మత్తులో కరెంట్ పోల్ కు కారును గుద్దేసిన యువతి
శుక్రవారం అర్థరాత్రి జూబ్లీహిల్స్ లో ఒక యువతి చిన్నపాటి బీభత్సాన్ని క్రియేట్ చేసింది.
By: Garuda Media | 15 Nov 2025 9:40 AM ISTశుక్రవారం అర్థరాత్రి జూబ్లీహిల్స్ లో ఒక యువతి చిన్నపాటి బీభత్సాన్ని క్రియేట్ చేసింది. పూటుగా తాగేసిన ఒక యువతి మత్తులో అత్యంత వేగంగా కారును నడిపింది. ఈ క్రమంలో పట్టు తప్పి.. కరెంట్ పోల్ ను గుద్దేసిన వైనం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వీకెండ్ పార్టీలు గడిచిన కొంతకాలంగా ఎక్కువ అవుతున్నాయి. రాత్రిళ్లు ఫుల్ గా తాగేసి.. మత్తులో డ్రైవింగ్ చేయటం.. ప్రమాదాలకు గురి కావటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
అర్థరాత్రి వేళ వేగంగా వెళుతున్న కారు పట్టు తప్పి.. కరెంట్ పోల్ దిమ్మె ను గుద్దేయటంతో పెద్ద శబ్దం చోటు చేసుకోవటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పల్టీలు కొట్టిన వైనం ఆ ప్రాంతంలో బీభత్సాన్ని క్రియేట్ చేసింది. వెంటనే స్పందించిన స్థానికులు.. కారు వద్దకు వెళ్లి.. అద్దాలు పగలగొట్టారు. డ్రైవింగ్ సీట్ లో ఒక యువతి ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె మత్తులో ఉన్న విషయాన్ని గుర్తించారు.
లక్కీగా కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావటంతో సదరు యువతికి చిన్నపాటి గాయాలు అయ్యాయే తప్పించి.. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కారు అద్దాలు పగులగొట్టి.. డ్రైవింగ్ సీట్లో ఇరుక్కుపోయిన ఆమెను బయటకు తీశారు. ఆమెను మెడికోగా గుర్తించారు. బాగా తాగేసి.. మత్తులో డ్రైవింగ్ చేయటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆ యువతిని ఇంటికి పంపినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇటీవల కాలంలో హైదరాబాద్ లో అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లుగా చెబుతున్నారు.
