Begin typing your search above and press return to search.

పురిట్లో బిడ్డ పోయిందని కిడ్నాప్ చేసుడేంది తల్లి

మనకు కష్టం వస్తే.. మరొకరికి నష్టం చేయాలన్న మైండ్ సెట్ ఏమిటో అర్థం కాదు. ఇటీవల కాలంలో ఈ తరహా తీరు అంతకంతకూ పెరుగుతోంది.

By:  Garuda Media   |   6 Aug 2026 9:49 AM IST
పురిట్లో బిడ్డ పోయిందని కిడ్నాప్ చేసుడేంది తల్లి
X

మనకు కష్టం వస్తే.. మరొకరికి నష్టం చేయాలన్న మైండ్ సెట్ ఏమిటో అర్థం కాదు. ఇటీవల కాలంలో ఈ తరహా తీరు అంతకంతకూ పెరుగుతోంది. తాజా ఉదంతం చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. తనకు సంబంధం లేకుండా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి దారుణ నేరానికి పాల్పడటం.. దాని ద్వారా తలెత్తే సమస్యల గురించి కనీస ఆలోచన ఉండదా? అన్నట్లుగా తాజాగా వెలుగు చూసిన ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది.

గర్భవతిగా ఉన్న మహిళ.. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే.. పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్ను మూయటం.. ఆ విషయాన్ని భర్తకు చెప్పకుండా దాచిన మహిళ.. దారుణ నేరానికి పాల్పడిన వైనం బయటకు వచ్చి.. అందరిని అవాక్కు అయ్యేలా చేసింది. హైదరాబాద్ శివారులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. 32 ఏళ్ల దుర్గా భవాని, ఆమె భర్త హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో నివాసం ఉంటారు. ఏపీలోని భీమవరం దుర్గా భవాని పుట్టిల్లు.

ఆ మధ్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన వేళ.. ప్రసవం వేళ పుట్టిన శిశువు కన్ను మూయటం.. పుట్టిన బిడ్డను చూసేందుకు భర్త పడుతున్న ఉత్సాహాన్ని అడ్డుకట్ట వేస్తూ.. జరిగిన విషాదం గురించి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వేళ.. తానే హైదరాబాద్ కు వస్తానని.. భర్తను భీమవరం రానివ్వలేదు. పుట్టిన కొడుకును చూపించవా?అని అడిగితే.. ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది. చివరకు భర్త నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేని ఆమె.. హైదరాబాద్ లో నెలల వయసున్న పిల్లాడ్ని కిడ్నాప్ చేయాలన్న ప్లాన్ వేసింది.

అందులో భాగంగా ఫిర్జాదిగూడలోని ఎనిమిది నెలల బాబును గుట్టు చప్పుడు కాకుండా కిడ్నాప్ చేసింది. అనంతరం కర్మన్ ఘాట్ కు వెళ్లి తాను కిడ్నాప్ చేసిన బాలుడ్ని చూపించింది. మరోవైపు తమ పిల్లాడు కనిపించకుండా పోవటంతో ఆందోళన చెందిన శివరామ్, స్పందన దంపతులు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన వారు సీసీ ఫుటేజ్ తనిఖీ చేయగా.. దుర్గాభవాని కిడ్నాప్ పర్వం బట్టబయలైంది. దీనికి తోడు ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన సమాచారాన్నివిశ్లేషించుకున్న పోలీసులు.. తమకు ఫిర్యాదు అందిన మూడు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ గురైన పిల్లాడ్ని గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. బాలుడ్ని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. నిజాన్ని దాచేయటం ఒక తప్పు అయితే.. భర్తను తప్పుదారి పట్టించటం మరో తప్పు. అన్నింటికి మించి తన భర్త అడుగుతున్నాడని.. వేరే వారి చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు సైతం తెగించిన దుర్గా భవాని తన చేతులతో తన జీవితాన్ని దెబ్బ తీసుకుందని చెప్పక తప్పదు.