Begin typing your search above and press return to search.

సాయం కోసం విదేశాంగ మంత్రికి హైదరాబాద్ అమ్మాయి వేడుకోలు

హైదరాబాద్ లోని లక్డీకాపూల్ కు చెందిన తాను 2022లో అమెరికా పౌరుడైన మహ్మద్ జైనుద్దీన్ ను పెళ్లి చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.

By:  Garuda Media   |   17 Sept 2025 11:25 AM IST
సాయం కోసం విదేశాంగ మంత్రికి హైదరాబాద్ అమ్మాయి వేడుకోలు
X

చికాగోకు చెందిన ఒక పోలీసు అధికారి (భర్త) చేతిలో తాను మోసపోయినట్లుగా హైదరాబాద్ కు చెందిన అమ్మాయి పేర్కొనటమే కాదు.. తనకు సాయం చేయాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ను కోరుతున్నారు. 2022లో చికాగోలో పోలీసుగా పని చేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ ను తాను పెళ్లి చేసుకున్నానని చెబుతోంది.అతను అమెరికా పౌరుడని పేర్కొన్న ఆమె.. అతను తనను మోసం చేశాడని చెప్పింది. దీనికి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒకఫిర్యాదు ఇప్పటికే చేసిన విషయాన్ని ప్రస్తావించింది. ఇంతకూ ఈ హైదరాబాద్ పాతబస్తీ మహిళ ఏం చెప్పారు? అసలేమైంది అన్న విషయంలోకి వెళితే..

హైదరాబాద్ లోని లక్డీకాపూల్ కు చెందిన తాను 2022లో అమెరికా పౌరుడైన మహ్మద్ జైనుద్దీన్ ను పెళ్లి చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. అతను చికాగో పోలీసు అధికారిగా పని చేస్తున్నట్లుగా చెప్పిన ఆమె.. 2024లో తాను అమెరికాకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. చికాగోలో తాము ఇద్దరం కలిసి ఉన్న చిరునామాను పేర్కొన్న ఆమె.. తన భర్త తనను శారీరకంగా.. మానసికంగా వేధింపులకు గురి చేసినట్లుగా పేర్కొన్నారు.

కొంతకాలం గడిచిన తర్వాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి.. ముందుగా వేసుకున్న ప్లాన్ లో భాగంగా 2025 ఫిబ్రవరి 7న తనను హైదరాబాద్ తీసుకొచ్చాడని చెప్పారు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో రూం తీసుకున్నామని.. ఆ తర్వాత తన తల్లిదండ్రుల్ని కలిసేందుకు వెళ్లామన్నారు. ఆ తర్వాత తన భర్త తన పాస్ పోర్టు.. గ్రీన్ కార్డు.. ఆభరణాలు లాంటి అన్ని వస్తువుల్ని తీసుకొని హోటల్ ఖాళీ చేసి అమెరికాకు వెళ్లిపోయాడన్నారు. ఈ నేపథ్యంలో తాను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లుగా పేర్కొన్నారు.

గడిచిన ఆర్నెల్లుగా తన భర్తను సంప్రదించటానికి తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లుగా పేర్కొన్న ఆమె.. న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని.. హైదరాబాద్ లోని కాన్సులేట్ ను సంప్రదించే ప్రయత్నం చేసినా.. ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనట్లుగా పేర్కొన్నారు. ఈ విషయంలో తాను పోరాడటానికి భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకొని భర్త మీద చట్టపరంగా పోరాడేందుకు.. యూఎస్ వెళ్లటానికి అవసరమైన వీసా మంజూరు చేయాలని కోరుతున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సాయం కోరిన ఆమె.. ఈ సందర్బంగా ఆయనకు ఒక లేఖ రాసింది. మరి.. ఈ విషయంలో కేంద్రమంత్రి స్పందన వెల్లడి కావాల్సి ఉంది.