హైదరాబాద్ లో మరో భర్త ప్రాణాల్ని తీసిన భార్య
పెళ్లైన తర్వాత పరాయి మగాడి మోజులో పడిన భార్య.. కట్టుకున్న భర్తను పాశవికంగా హత్యలు చేస్తున్న పరంపర అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
By: Garuda Media | 4 Jan 2026 1:27 PM ISTపెళ్లైన తర్వాత పరాయి మగాడి మోజులో పడిన భార్య.. కట్టుకున్న భర్తను పాశవికంగా హత్యలు చేస్తున్న పరంపర అంతకంతకూ ఎక్కువ అవుతోంది. నిజానికి భర్తతో తనకు సంతోషంగా లేకున్నా.. ఆనందంగా ఉండలేకపోయినా.. తనకు కలిసి జీవించటం సాధ్యం కాదని డిసైడ్ అయిన తర్వాత చట్టబద్ధంగా విడిపోవటం సముచితం. అయితే.. అందుకు సమాజం.. చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించవన్న ఉద్దేశం ఒక వైపు..మరోవైపు తమకు మించిన తెలివైనోళ్లు ఎవరూ ఉండరన్నట్లుగా భావించి సింఫుల్ గా హత్య చేసేసి తప్పించుకోవచ్చన్న అతి తెలివి అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాజాగా మరోసారి అలాంటి దారుణ ఉదంతమే హైదరబాద్ లో చోటు చేసుకుంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతో భర్తను చంపేసిన భార్య ఉదంతమిది. ఒడిశాకు చెందిన 32 ఏళ్ల నారాయణకు, 27 ఏళ్ల బంధితకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది. హైదరాబాద్ లో సెటిల్ అయిన నారాయణ.. ప్లంబర్ గా పని చేస్తుంటాడు.
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ లో వీరి నివాసం. ఇదిలా ఉండగా పాతికేళ్ల విద్యాసాగర్ బిహార్ కు చెందిన వాడు. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఉంటున్నాడు. నారాయణ, విద్యాసాగర్ ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. ఈ సందర్భంగా వీరి మధ్య మొదలైన పరిచయం చివరకు వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవటానికి భర్తను హత్య చేయటమే పరిష్కారంగా భావించింది.
ఇందులో భాగంగా నారాయణ, విద్యాసాగర్ కలిసి మద్యం తాగారు. అర్థరాత్రి ఇంటికి వచ్చిన భర్తతో గొడవ పెట్టుకున్న బంధిత.. తమ ప్లాన్ లో భాగంగా ప్రియుడితో కలిసి భర్త తల మీద ఐరన్ రాడ్ తో బలంగా కొట్టటంతో అక్కడికక్కడే మరణించాడు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు రోజు వ్యవధిలోనే నిందితుడ్ని గుర్తించి అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో భర్తను ప్లాన్ చేసి చంపేసిన వైనం ఒప్పుకోవటంతో వారిని రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
