Begin typing your search above and press return to search.

సర్.. ఒక్క హైదరాబాద్ లోనే 40 లక్షల ఓట్లు కట్.. మునిగేదెవరు?

ఉమ్మడి రాజధానిగా బిర్యానీ రాజధానిగా పేరొందిన మన హైదరాబాద్‌లో ఏకంగా 40 లక్షల ఓట్లు గాల్లో తేలిపోతున్నాయన్న వార్త పొలిటికల్ సర్కిళ్లలో పెను భూకంపమే సృష్టిస్తోంది.

By:  A.N.Kumar   |   9 Aug 2026 11:33 AM IST
సర్.. ఒక్క హైదరాబాద్ లోనే 40 లక్షల ఓట్లు కట్.. మునిగేదెవరు?
X

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలిసినా.. ఏ టీ కొట్టు దగ్గర చూసినా ఒకటే ముచ్చట.. అదే 'ఎస్.ఐఆర్' సర్వే గురించిన రగడ.. ఐటీ కారిడార్‌లో ఏసీ రూముల్లో కూర్చుని సిస్టమ్స్ ముందు కోడింగ్ రాసే పౌరుల నుంచి.. భాగ్యనగరపు సందు చివర సవారీ చేసే నేతల వరకు అందరి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఉమ్మడి రాజధానిగా బిర్యానీ రాజధానిగా పేరొందిన మన హైదరాబాద్‌లో ఏకంగా 40 లక్షల ఓట్లు గాల్లో తేలిపోతున్నాయన్న వార్త పొలిటికల్ సర్కిళ్లలో పెను భూకంపమే సృష్టిస్తోంది.

హైదరాబాద్ నగరం పరిధిలోని మొత్తం 47.36 లక్షల మంది ఓటర్లలో ఇప్పటివరకు డిజిటైజ్ అయింది దాదాపు 57 శాతమే కావడంతో మిగతా 40 శాతానికి పైగా ఓటర్ల వివరాలు "అసలు ఉన్నారా లేక మాయమయ్యారా" అనే ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు మన బూత్ లెవల్ ఆఫీసర్లు గడప తొక్కినా చిక్కని మహానుభావులు, ఆంధ్రాలో ఒక ఓటు వేసి ఇక్కడొక ఓటుతో ఎంజాయ్ చేసే 'డబుల్ రోల్' లీడర్లు.. ఇళ్లు మారి కొత్త అడ్రస్ చెప్పని వాళ్లు కలిసి ఏకంగా 9.95 లక్షల మందిని 'ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్' జాబితాలో కూర్చోబెట్టేశారు.

మరోవైపు త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కురుక్షేత్రం రాబోతోందని భావించి.. ఇప్పటినుంచే ప్లాన్లు వేస్తూ బిర్యానీ ప్యాకెట్లు, సంక్షేమ పథకాల క్యాలెండర్లు సిద్ధం చేసుకుంటున్న రాజకీయ పార్టీలకు ఈ ఓట్ల గల్లంతు వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ముఖ్యంగా "సొంత ఊర్లో పండక్కి వెళ్ళి ఓటు వేస్తాం.. ఇక్కడ హైదరాబాద్‌ లో సెటిలై రియల్ ఎస్టేట్ చూసుకుంటాం" అనుకునే వలస జీవుల పేర్లు జాబితా నుంచి ఊడిపోతే తమ పరిస్థితి ఏంటని ఏపీ ఓటర్ల పైన ఆశలు పెట్టుకున్న కొన్ని పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే బహదూర్ పురా, సికింద్రాబాద్ పరిధిలో డిజిటైజేషన్ 60 శాతానికి పైగా పూర్తయితే.. సనత్ నగర్, మలక్‌పేట, ముషీరాబాద్‌లలో మాత్రం ఇంకా ఆమడ దూరంలోనే బండి నడుస్తోంది. దీంతో ఏ ఏరియాలో ఎవరి డిపాజిట్ ఎగిరిపోతుందో ఏ ఏరియాలో గెలుపు గుర్రాలు రేసు నుంచి తప్పుకుంటాయో తెలియక స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు బీఎల్‌వోల వెనకాల ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు అనుభవించడం తమ ప్రాథమిక హక్కు అనుకున్న సగటు హైదరాబాదీకి, ఎలక్షన్ కమిషన్ వచ్చి ఒకే చోట ఓటు అని మెలిక పెట్టడంతో ఎటు పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

ఆగస్టు 10తో ఎన్యుమరేషన్ గడువు ముగుస్తుండటంతో నా ఓటు ఉంటుందో ఊడుతుందో అని సగటు ఓటరు, పక్క పార్టీ ఓటు పోతే చాలు అని ప్రార్థించే నేతల మధ్య ఈ సర్వే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. చూడాలి మరి ముసాయిదా ముగిసి తుది జాబితా వచ్చేసరికి ఎంతమంది హైదరాబాదీలకు ఓటు మిగులుతుందో, ఎంతమంది బడా నేతల సీట్లకు ఎసరు వస్తుందో..