30 ఏళ్లలో తొలిసారి.. మూసీ ఉగ్రరూపుతో హైరాబాద్ ఉక్కిరిబిక్కిరి
వరుస పెట్టి కురుస్తున్న వర్షాలతో పాటు.. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా గడిచిన మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా మూసీ ఉగ్రరూపు దాల్చింది.
By: Garuda Media | 27 Sept 2025 10:18 AM ISTవరుస పెట్టి కురుస్తున్న వర్షాలతో పాటు.. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా గడిచిన మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా మూసీ ఉగ్రరూపు దాల్చింది. దీంతో.. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ వణికిపోతున్న పరిస్థితి. గండిపేట మొదలు నాగోలు వరకు మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో.. ఇటీవల కాలంలో కనివిని ఎరుగని పరిస్థితులు ఎదురవుతున్నాయి. మూసీకి సమీపాన ఉండే నివాసాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.
మూసీకి వరద పోటు భారీగా పెరగటంతో ఎంజీబీఎస్ బస్టాండ్ లోకి వరద నీరు పోటెత్తటమే కాదు.. బస్టాండ్ లోని ప్రయాణికులు అందులో చిక్కుకుపోయిన పరిస్థితి. చాదర్ ఘాట్ సమీపంలోపి మూసానగర్ లో 200 ఇళ్లు వరదలో ముగినిపోగా.. చేతికి అందిన వస్తువుల్ని పట్టుకొని.. కట్టుబట్టలతో ప్రజలు ఇళ్లల్లో నుంచి రోడ్ల మీదకు వచ్చిన దుస్థితి. తమ సామాన్లు వరదలో కొట్టుకుపోయినట్లుగా స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
చాదర్ ఘాట్ సమీపంలోని రసూల్ పురా నుంచి 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ ఘాట్ కాజ్ వే పై నుంచి వరద నీరు పోటెత్తటంతో భారీ ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. కాజ్ వేను ఏ క్షణమైనా మూసి వేసే పరిస్థితి. ముసారంబాగ్ వంతెనపై నుంచి నాలుగు అడుగుల మేర వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకల్ని నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో వంతెనలు.. కల్వర్టు ప్రాంతాల్లో రాకపోకల్ని నిలిపివేశారు. బాపూ ఘాట్ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీనంతటికి కారణం.. గడిచిన ముప్ఫై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జంట జలాశయాల నుంచి భారీగా వరద నీటిని కిందకు వదలటమే. జంట జలాశయాల గేట్లు ఎత్తి 38,500 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి వదిలారు.
ఉస్మాన్ సాగర్ ప్రస్తుత ఇన్ ఫ్లో 12,600 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో13,335 క్యూసెక్కులు. పదిహేను గేట్లు ఎత్తి తొమ్మిది అడుగుల మేర నీటిని కిందకు అధికారులు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ ఇన్ ఫ్లో 18,500 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 20,872 క్యూసెక్కులు. మొత్తంగా పదకొండు గేట్లు ఎత్తి ఎనిమిది అడుగుల మేర నీటిని కిందకు వదులుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వాటర్ బోర్డు అధికారులకు రానున్న రెండు రోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా అధికారులు నిర్ణయించారు.
గురువారం రాత్రి నుంచి మొదలైన వర్షం శుక్రవారం మొత్తం వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జనం ఇంటికే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఐటీ కంపెనీలు ఇంటి నుంచి పని చేసే ఆప్షన్ ను ఉద్యోగులకు ఇవ్వటంతో.. ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తగ్గాయి. దీనికి తోడు స్కూళ్లు దసరా సెలవుల కారణంగా పని చేయని కారణంగా.. ట్రాఫిక్ ఇబ్బందులు కాస్త తగ్గాయి. అయితే.. మూసీ పరివాహక పరాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో..రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి. మొత్తంగా మూసీ మహోగ్రరూపం హైదరాబాద్ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
