Begin typing your search above and press return to search.

గుప్తనిధి ‘గోల్డ్ కోల్’ స్కామ్.. బొగ్గును చూపి కోటి కొట్టేశారు!

హైదరాబాద్ నగరంలో ఒకవైపు డిజిటల్ విప్లవం పరిగెడుతుంటే.. మరోవైపు మన అమాయకత్వం మాత్రం ఇంకా పూర్వీకుల కాలం నాటి ‘గుప్త నిధుల’ దగ్గరే ఆగిపోయింది.

By:  A.N.Kumar   |   11 Aug 2026 3:11 PM IST
గుప్తనిధి  ‘గోల్డ్ కోల్’ స్కామ్.. బొగ్గును చూపి కోటి కొట్టేశారు!
X

హైదరాబాద్ నగరంలో ఒకవైపు డిజిటల్ విప్లవం పరిగెడుతుంటే.. మరోవైపు మన అమాయకత్వం మాత్రం ఇంకా పూర్వీకుల కాలం నాటి ‘గుప్త నిధుల’ దగ్గరే ఆగిపోయింది. నేల కింద రాగి చెంబులు, బంగారు నాణేలు నిద్రపోతున్నాయని ఎవరో ఒకరు చెప్పడం.. దానిని గుడ్డిగా నమ్మేసి లక్షలకు లక్షలు సమర్పించుకోవడం నేటి కాలంలోనూ జరుగుతోందంటే నవ్వాలో లేక బాధపడాలో అర్థం కానంత విచిత్రంగా ఉంది. ఆధునిక జీవితాన్ని.. కామన్ సెన్స్‌ను పక్కనపెట్టి పూజారుల మాయమాటలు నమ్మేసే జనాలు ఉన్నంత వరకు ఈ ‘గుప్త నిధి’ కేటుగాళ్లకు తిరుగే ఉండదని మరోసారి నిరూపితమైంది. తాజాగా భాగ్యనగరంలో గుట్టురట్టయిన ఒక భారీ స్కామ్ చూస్తే మోసగాళ్ల తెలివితేటల కంటే బాధితుల అమాయకత్వమే కేక పుట్టిస్తోంది. నలుగురు సభ్యుల ఒక ఘరానా ముఠా ఏకంగా 11 మంది అమాయకులను తమ మాయాజాలంలో దింపి.. సుమారు కోటి రూపాయల వరకు తమ ఖాతాలో వేసుకుని జైలు పాలయ్యారు.

ఈ ముఠా ప్లాన్ చేసిన విధానం ఏ రేంజ్‌లో ఉందంటే ఏకంగా సైన్స్ లాజిక్‌కే సవాల్ విసిరేలా ఉంది. మొదట పక్కా ప్లాన్‌తో బాధితులను ఎంచుకుని.. మీ ఇంట్లో మీ ముత్తాతల నాటి భారీ గుప్త నిధి దాగి ఉందంటూ సీరియస్‌గా ఒక బిస్కట్ వేసేవారు. ఆ తర్వాత బాధితుడికి తెలియకుండా ఇంట్లోనే ఒక రహస్య స్థలంలో గుంత తవ్వి, అందులో కొంత మట్టి, 6 కిలోల బొగ్గు, నకిలీ బంగారు పూత పూసిన 25 నాణేలు ఉన్న సంచిని పాతిపెట్టేవారు. అనంతరం బాధితులను అక్కడికి తీసుకెళ్లి ఆ గుంతను చూపిస్తూ ఇదిగోండి మీ ఇంట్లోని గుప్త నిధి బయటపడిందని నమ్మించేవారు. మరి అక్కడ బంగారం బదులు బొగ్గు ఉందేంటి అని బాధితులు సందేహం వ్యక్తం చేస్తే, బాబోయ్.. ఇది వెంటనే బంగారం అవ్వదు సామీ దీనికి గ్యాప్ కావాలి.. ప్రత్యేక తాంత్రిక పూజలు చేసి మంత్రాలు చదివితేనే ఆ బొగ్గు కాస్తా విలువైన బంగారంగా మారుతుందని గంభీరంగా కలరింగ్ ఇచ్చేవారు.

ఆ మాటలను నిజమని నమ్మిన బాధితులు.. రేపో మాపో ఆ బొగ్గు మెరిసే బంగారంగా మారిపోతుందనే ఆశతో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవారు. పూజలు, ప్రత్యేక తాంత్రిక సామగ్రి, గుప్త నిధి వెలికితీత ఖర్చులు అంటూ ఆ ముఠా అడిగినప్పుడల్లా విడతల వారీగా కోటి రూపాయల వరకు అప్పజెప్పేశారు. రోజులు గడుస్తున్నా బొగ్గు బొగ్గులాగే ఉంది తప్ప.. రవ్వంతైనా బంగారం కాకపోవడంతో చివరికి బాధితులకు విషయం అర్థమైంది. తాము దారుణంగా మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కేటుగాళ్ల గుట్టురట్టు చేసి.. వారి వద్ద నుంచి 25 నకిలీ బంగారు నాణేలు, 6 కిలోల అసలు సిసలైన బొగ్గు , మట్టిని స్వాధీనం చేసుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

బొగ్గును బంగారంగా మార్చే మాయా విద్యలు లోకంలో ఎక్కడా లేవని, గుప్త నిధులు.. తాంత్రికుల పేరుతో వచ్చే మోసగాళ్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. ఎంతటి చదువుకున్న వారైనా సరే కష్టపడకుండా ఊరికే వచ్చే ఆస్తి కోసం ఆశపడితే ఉన్నది ఊడిపోతుందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఇకనైనా జనాలు నిధుల ఆశ పక్కనపెట్టి కష్టపడి సంపాదించడమే అసలైన 'బంగారం' అని గ్రహిస్తే అందరికీ మంచిది.