గ్రేటెస్ట్ హైదరాబాద్ కానున్న గ్రేటర్....
జీహెచ్ ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు దాకా విస్తరించే యోచనలో రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది.
By: Tupaki Political Desk | 1 Dec 2025 10:00 PM ISTజీహెచ్ ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు దాకా విస్తరించే యోచనలో రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంలా మరింత విస్తృతంగా తీర్చిదిద్దే విప్లవాత్మక ఆలోచనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.దీని ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మునిసిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం అవుతాయి. దీంతో విశ్వనగరం రూపురేఖలు సంపూర్ణంగా మారిపోతాయి. జీహెచ్ ఎంసీ విస్తరించడం వల్ల రోడ్లు,డ్రైనేజీల్లాంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగవుతాయి. అన్నిటికీ మించి విలీనం వల్ల రాజకీయ సమీకరణాల్లోనూ పెనుమార్పులు చోటుచేసుకోవడం ఖాయం.
మెట్రో ప్రాంతాన్నంతటిని ఒకే గొడుగు కిందకి తీసుకురావడం వల్ల బహుళ ప్రయోజనాలుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. పారిశుధ్యం, రహదారులు, నీటి సరఫరా , డ్రైనేజీ వ్యవస్థల్ని ఏకీకృతం చేయవచ్చు. ఫలితంగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడమే కాకుండా...సమాన సౌకర్యాలు అందుతాయన్నది కేబినెట్ ఆలోచన. జీహెచ్ ఎంసీ పరిధి పెరిగితే పన్ను రాబడి అంతే స్థాయిలో పెరుగుతుంది. విలీనానికి సంబంధించి సమగ్రనివేదికి అందించాల్సిందిగా ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించింది.
ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో 24 నియోజకవర్గాలు, 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 150 డివిజన్లున్నాయి. విలీన ప్రక్రియ అమలైతే డివిజన్ల సంఖ్య 300కు పెరుగుతుంది. అలాగే హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న మేడ్చల్ జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోతుంది. ఈ జిల్లా జీహెచ్ఎంసీలో కలిపేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ విస్తరిస్తే హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంలా అవతరిస్తుంది. పలు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. వాణిజ్య పరమైన డిమాండ్ పెరగడంతో...పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చే వీలుంది. బిజినెస్, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుంది.
జీహెచ్ ఎంసీ విస్తరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అడుగులు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ విశ్వనగరంగా మార్చామమని, రహదారులు విస్తరించామని, భూముల విలువలు పెరిగాయని ప్రచారం చేసుకున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ మార్క్ పాలన ఇదీ అని నిరూపించుకోడానికి ప్రయత్నిస్తోంది.
తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తొలినాళ్ళలో బోల్డంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. రియల్ ఎస్టేట్ డమాల్ అయ్యిందని, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమాత్రం బడ్జెట్ కేటాయించక వివక్ష చూపుతున్నా...ముఖ్యమంత్రి కనీసం నోరెత్తి ప్రశ్నించలేదని, కాంగ్రెస్ కు పట్టం కట్టినందుకు తెలంగాణ ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నేతలు అవకాశం దొరికిన ప్రతిసారి ప్రజల్లో ప్రచారం తీసుకెళ్ళగలిగారు. చాలా సందర్భాల్లో ఇక సీఎం రేవంత్ అధ్యాయం ముగిసినట్టే అన్న ప్రచారం కొనసాగినా...సీఎం వాటిని ఖాతరు చేయకుండా తమదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారని కాంగ్రెస్ వాదులు ప్రతిగా స్పందిస్తున్నారు. ఎలాగైనా తమ మైలేజీ కాపాడుకుని స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా ప్రజలముందుకెళ్ళాలని బీసీ రిజర్వేషన్ సమస్యను ముందుకు తీసుకెళితే...అదీ బూమ్ రాంగ్ కావడంతో ...ఇలా కాదని మెట్రో ప్రభుత్వపరంగా చేసుకోవడం, జీహెచ్ఎంసీ విస్తరణ, ఫ్యూచర్ సిటీ, హైడ్రా దూకుడు తదితర నిర్ణయాలతో సీఎం రేవంత్ తమ మార్క్ పాలన చూపించడానికి సిద్ధమవుతున్నారనే చెప్పాలి.
.
