దొంగతనం చేసి.. ఆ ఇంట్లోనే గురకపెట్టి నిద్రపోయాడు.. ఈ దొంగ వీడియో వైరల్
హైదరాబాద్‌లోని వాడి-ఎ-ముస్తఫా ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి మన కథానాయకుడు అదేనండి.. దొంగగారు అర్థరాత్రి వేళ ప్రవేశించాడు.
By: A.N.Kumar | 14 Aug 2026 12:00 AM ISTసాధారణంగా దొంగతనం చేసిన తర్వాత ఏ దొంగ అయినా ఏం చేస్తాడు? పోలీసులు పట్టుకుంటారేమోనన్న భయంతో 'చూపులకి అందనంత' దూరానికి పారిపోతాడు. విమానాలు, రైళ్లు ఎక్కి రాష్ట్రాలు, దేశాలు దాటేసిన ఘనులను కూడా చూశాం. కానీ మన హైదరాబాద్ పాతబస్తీ దొంగగారు మాత్రం కాస్త విభిన్నం.. చాలా ట్రెండీ "దొంగతనం అనేది ఒత్తిడితో కూడుకున్న పని కాసేపు రెస్ట్ తీసుకుంటే తప్పేంటి?" అనుకున్నాడో ఏమో గానీ చోరీ చేసిన ఇంట్లోనే ఏకంగా గురకపెట్టి మరీ ఆదమరిచి నిద్రపోయాడు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్‌లోని వాడి-ఎ-ముస్తఫా ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి మన కథానాయకుడు అదేనండి.. దొంగగారు అర్థరాత్రి వేళ ప్రవేశించాడు. ముందే ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్నాడు. అయినా కూడా తన వృత్తి ధర్మాన్ని ఏమాత్రం మరవకుండా ఇంట్లోని బంగారం, ఒక ఖరీదైన మొబైల్ ఫోన్‌ను చాలా జాగ్రత్తగా నొక్కేశాడు.
ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.. వస్తువులన్నీ సర్దుకున్నాక పక్కనే ఉన్న మెత్తటి బెడ్ ఆయనగారిని రమ్మని పిలిచింది. మందు మత్తు, రాత్రివేళ అలసట తోడవడంతో.. "సర్లే కాసేపు పడుకుని ఉదయాన్నే ఫ్రెష్‌గా వెళ్దాం" అని ఫిక్స్ అయిపోయాడేమో.. హాయిగా బెడ్‌పై వాలిపోయి పక్కలో పెళ్లాం ఉన్నట్లు ఏకాంతంగా గురక పెట్టడం ప్రారంభించాడు.
యజమానికి దొరికిన 'రాత్రి గిఫ్ట్'
మరుసటి రోజు ఉదయాన్నే లేచిన ఇంటి యజమానికి రూమ్ లోంచి ఎవరో భారీ స్థాయిలో 'రైలు ఇంజిన్' స్టార్ట్ చేసినట్లు గురక శబ్దాలు వినిపించాయి. "అసలు ఈ టైమ్‌లో మా ఇంట్లో ఇంత గొప్పగా సంగీతం పాడుతోంది ఎవరురా సామీ?" అని సందేహంతో తలుపు తీసి చూశాడు. అక్కడ దృశ్యం చూసి యజమానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
గోడకి ఉండాల్సిన బంగారం, టేబుల్‌పై ఉండాల్సిన ఫోన్ పక్కన పడేసి.. ఓ అపరిచిత వ్యక్తి హాయిగా నిద్రపోతున్నాడు. యజమానికి విషయాన్నీ అర్థం చేసుకోవడానికి కాసేపు పట్టింది. పారిపోవాల్సిన దొంగ, ఇంట్లోనే హాయిగా ఏసీ/ఫ్యాన్ కింద నిద్రపోతుంటే.. డ్యూటీలో ఉన్న పోలీసులకి కూడా ఇంత సులువైన కేసు బహుశా ఎప్పుడూ దొరికి ఉండదేమో!
నెట్టింట వీడియో వైరల్
సదరు యజమాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వింత దొంగను అలాగే పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. నిందితుడు తాపీగా నిద్రపోతున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఈ 'నిద్రదేవుడి' వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
"ఇంత నిబద్ధత ఉన్న దొంగను మేమెప్పుడూ చూడలేదు బాబోయ్!", "పోలీసుల శ్రమను తగ్గించిన దొంగగారికి జోహార్లు " అంటూ నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని ఆ మహానుభావుడికి లాకప్‌లో సరైన 'బెడ్' ఏర్పాటు చేశారు.
