Begin typing your search above and press return to search.

ఫిన్‌లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..

హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన మణిదీప్‌రెడ్డి ఇంజినీరింగ్‌ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఫిన్‌లాండ్ వెళ్లారు.

By:  A.N.Kumar   |   12 July 2026 11:21 AM IST
ఫిన్‌లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
X

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం కేసు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఫిన్‌లాండ్‌లో అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిన వనస్థలిపురానికి చెందిన మణిదీప్‌రెడ్డి కేసులో అక్కడి పోలీసులు కీలక ప్రకటన చేశారు. అయితే పోలీసుల వాదనను మణిదీప్ కుటుంబ సభ్యులు పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. తమ కుమారుడి అదృశ్యం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందంటూ వారు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

అసలేం జరిగింది?

హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన మణిదీప్‌రెడ్డి ఇంజినీరింగ్‌ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఫిన్‌లాండ్ వెళ్లారు. అయితే ఈ ఏడాది మే 5న ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమయ్యారు. ఆ రోజు నుంచి మణిదీప్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో తాజాగా ఫిన్‌లాండ్ పోలీసుల నుండి మణిదీప్ తల్లిదండ్రులకు ఒక ఈమెయిల్ వచ్చింది.

సముద్రతీరంలో ఒక మృతదేహం లభ్యమైందని, బయోమెట్రిక్ పరీక్షల ఆధారంగా అది మణిదీప్‌రెడ్డిదేనని పోలీసులు ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు. ఆధారాలుగా మృతదేహం వద్ద దొరికిన కొన్ని వ్యక్తిగత కార్డుల ఫోటోలను కూడా జత చేశారు.

65 రోజుల తర్వాత ఎలా దొరుకుతుంది? తల్లిదండ్రుల తీవ్ర అనుమానాలు

ఫిన్‌లాండ్ పోలీసుల ఈ ప్రకటనను మణిదీప్ తండ్రి ముత్యంరెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసుల ఇమెయిల్‌పై ఆయన స్పందిస్తూ పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. మే 5న అదృశ్యమైన తమ కుమారుడి మృతదేహం, దాదాపు 65 రోజుల తర్వాత సముద్రతీరంలో ఎలా లభిస్తుందని ఆయన ప్రశ్నించారు. అంత కాలం నీటిలో ఉంటే మృతదేహం గుర్తుపట్టేలా ఎలా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఫిన్‌లాండ్‌లోని చట్టాల ప్రకారం నిర్దిష్ట గడువులోగా కేసులను క్లోజ్ చేయాల్సి ఉంటుందని, ఆ నిబంధనల వల్లే పోలీసులు వేరే ఎవరిదో మృతదేహాన్ని తమ కుమారుడిదిగా చూపిస్తూ కేసును త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ కుమారుడి కోసం తాము స్వయంగా ఫిన్‌లాండ్ వెళ్దామనుకుంటే అక్కడి ప్రభుత్వం తమకు వీసా మంజూరు చేయలేదని ముత్యంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిన్‌లాండ్‌కు చెందిన ఒక వ్యక్తిపై తమకు గట్టి అనుమానాలు ఉన్నాయని, ఆ విషయాన్ని పోలీసులకు చెప్పినా వారు సరిగ్గా దర్యాప్తు చేయలేదని స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

"మా అబ్బాయి ఆచూకీ కోసం ఇప్పటికే మేము భారతదేశంలో హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశాం. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఫిన్‌లాండ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయి నిష్పక్షపాత దర్యాప్తు జరిగేలా చూడాలి" అని ముత్యంరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకున్నారు.

ప్రస్తుతం ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఫిన్‌లాండ్ పోలీసులు చెబుతున్న బయోమెట్రిక్ రిపోర్టులు నిజమేనా? లేక కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందా? కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా ఆ మృతదేహం మణిదీప్‌ది కాకపోతే, అసలు ఆయన ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.