Begin typing your search above and press return to search.

బహుళ అంతస్తుల ధమాకా.. ఆకాశమే హద్దుగా మారుతున్న హైదరాబాద్

ఒకప్పుడు విస్తరించే నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ ఇప్పుడు పైకి (పెద్ద పెద్ద భవంతులు) ఎదుగుతున్న మహానగరంగా మారుతోంది.

By:  Tupaki Political Desk   |   3 Jan 2026 4:00 PM IST
బహుళ అంతస్తుల ధమాకా.. ఆకాశమే హద్దుగా మారుతున్న హైదరాబాద్
X

ఒకప్పుడు విస్తరించే నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ ఇప్పుడు పైకి (పెద్ద పెద్ద భవంతులు) ఎదుగుతున్న మహానగరంగా మారుతోంది. భూమి కొరత, పెరుగుతున్న డిమాండ్‌, మారుతున్న జీవనశైలి ఈ మూడు కలిసి నగర స్కైలైన్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. తాజాగా కోకాపేట నియోపోలిస్‌లో 60 అంతస్తులు దాటిన భవనాల నిర్మాణం మొదలవడం, హైదరాబాద్‌ ఇక కేవలం ఐటీ నగరమే కాదు.. సూపర్‌ హై రైజ్‌ సిటీగా రూపాంతరం చెందుతోందన్న సంకేతాన్ని ఇస్తోంది.

నగరంలో రికార్డు బిల్డింగులు

2025 ఏడాది బహుళ అంతస్తుల నిర్మాణాల్లో రికార్డు స్థాయిలో ముందుకెళ్లింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 94, జీహెచ్‌ఎంసీ పరిధిలో 103 భారీ భవనాలకు అనుమతులు లభించాయి. ఇది గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ పరిధిలో బిల్టప్‌ ఏరియా విస్తీర్ణం ఏకంగా 91.16 లక్షల చదరపు మీటర్లకు చేరింది. 2024లో ఇది కేవలం 36.5 లక్షల చదరపు మీటర్లకే పరిమితం కావడం చూస్తే, ఈ ఏడాది నిర్మాణ రంగం ఎంత వేగంగా దూసుకెళ్లిందో అర్థమవుతుంది. ఈ వేగానికి ప్రధాన కారణం.. హైదరాబాద్‌లో ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (FSI)పై కఠిన నియంత్రణలు లేకపోవడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముంబాయి, ఢిల్లీ వంటి మహానగరాల్లో ఎఫ్‌ఎస్‌ఐ పరిమితులు బహుళ అంతస్తుల నిర్మాణాలను ఒక హద్దులో ఉంచుతున్నాయి. అక్కడ భవన ఎత్తు, విస్తీర్ణం అన్నీ కచ్చితమైన నిబంధనలతో ఉంటాయి. కానీ హైదరాబాద్‌లో అలాంటి ఆంక్షలు లేకపోవడంతో డెవలపర్లకు విస్తృత వెసులుబాటు లభిస్తోంది. అదే వెసులుబాటు ఇప్పుడు నగరాన్ని పైకి పెరుగుతున్న నగరంగా మార్చుతోంది.

నగరాన్ని ఆశ్చర్య పరుస్తున్ ‘నియోపోలిస్’

ఈ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారింది కోకాపేట నియోపోలిస్‌. ఇక్కడ ఇప్పటికే 63 అంతస్తుల వరకు అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఒకప్పుడు నగర అవుట్‌స్కర్ట్‌గా భావించిన ప్రాంతం, ఇప్పుడు అత్యంత ప్రీమియం రియల్‌ ఎస్టేట్‌ జోన్‌గా మారింది. ఐటీ హబ్‌లకు సమీపం, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ కనెక్టివిటీ, ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికలు ఇవన్నీ కలిసి కోకాపేటను స్కైస్క్రాపర్లకు చిరునామాగా మార్చేశాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. 2024లో 69 భారీ భవనాలకు మాత్రమే అనుమతులు ఇవ్వగా, 2025లో ఆ సంఖ్య 103కు పెరిగింది. సాధారణ భవనాలకు కూడా 2,381 అనుమతులు ఇచ్చారు. ఈ సంఖ్య స్వల్పంగా పెరిగినా, బహుళ అంతస్తుల వైపు ఉన్న మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలో అయితే ఈ మార్పు మరింత స్పష్టం. గతేడాది 55 అనుమతుల నుంచి ఈ సారి 94 అనుమతులకు చేరడం నిర్మాణ రంగంలో వచ్చిన ఊపును ప్రతిబింబిస్తోంది.

నివాసితుల ఇష్టానికి అనుగుణంగా..

నివాసుల అభిరుచుల్లోనూ మార్పు కనిపిస్తోంది. పైఅంతస్తుల్లో నివసిస్తే ప్రశాంత వాతావరణం, కాలుష్యం ముప్పు తక్కువ, మెరుగైన వ్యూ లభిస్తుందన్న భావన బలపడుతోంది. దీంతో హై రైజ్‌ అపార్ట్‌మెంట్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఒకప్పుడు ‘గ్రౌండ్‌ ఫ్లోర్‌ ఇల్లు’ అంటేనే భద్రతగా భావించిన నగరవాసులు, ఇప్పుడు ‘స్కై లివింగ్‌’ వైపు అడుగులు వేస్తున్నారు. ఇదంతా సాధ్యమవడానికి పరిపాలనా మార్పులు కూడా కారణమని చెప్పాలి. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ‘బిల్డ్‌నౌ’ సాఫ్ట్‌వేర్‌ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసింది. గతంలో ప్లాన్‌ల అప్‌లోడ్‌, పరిశీలనలో నెలల తరబడి జాప్యం జరిగేది. ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే మ్యాపులు, డిజైన్‌లు అప్‌లోడ్‌ అవుతున్నాయి. పరిశీలన కూడా వేగంగా జరుగుతోంది. పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించడంతో తిరస్కరణ శాతం గణనీయంగా తగ్గింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 2023లో 18 శాతం, 2024లో 20 శాతం ఉన్న తిరస్కరణలు 2025 నాటికి 15 శాతానికి తగ్గడం దీనికి నిదర్శనం.

తలెత్తుతున్న కీలక ప్రశ్నలు..

అయితే ఈ ఆకాశహర్మ్యాల ఉత్సాహం మధ్య కొన్ని కీలక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్‌, నీటి వనరులు, అత్యవసర సేవలు ఇవన్నీ ఈ స్థాయి ఎత్తైన నిర్మాణాలకు సరిపడా సిద్ధంగా ఉన్నాయా..? ఎఫ్‌ఎస్‌ఐ నియంత్రణలు లేకపోవడం అభివృద్ధికి దోహదం చేసినా, భవిష్యత్తులో ప్లానింగ్‌ లోపాలుగా మారకూడదన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ ఇప్పుడు స్పష్టంగా ఒక మలుపులో నిలబడి ఉంది. నగరం భూమిపై విస్తరించాలా, ఆకాశాన్ని తాకాలా అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికే ఇచ్చేసింది. ఇక అవసరం ఒక్కటే—ఈ బహుళ అంతస్తుల అభివృద్ధి నగరాన్ని మరింత జీవనయోగ్యంగా మార్చాలే తప్ప, భారంగా మారకూడదు. స్కైలైన్‌ ఎంత ఎత్తుకు ఎదిగినా, నగర ప్రణాళిక మాత్రం నేలమీద బలంగా ఉండాల్సిందే.