Begin typing your search above and press return to search.

ఇన్ స్టెంట్ ఫ్రెండింగ్.. ఇప్పుడిదే ట్రెండ్!

సోషల్ మీడియాలో అపరిచిత స్నేహాలు సరిపోవన్నట్లుగా కొన్ని సంస్థలు నగరంలోని కొన్ని వేదికల మీద ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.

By:  Garuda Media   |   18 Oct 2026 2:00 PM IST
ఇన్ స్టెంట్ ఫ్రెండింగ్.. ఇప్పుడిదే ట్రెండ్!
X

ఏదైనా అనుకున్నంతనే జరిగిపోవాలి. నచ్చినోళ్లను ఎంచుకోవటం.. వారితో స్నేహం చేయటం.. మరింతముందుకు వెళ్లటం లాంటి వాటికి ఎంత టైం పడుతుందంటే..వారాలే కాదు ఒక్కోసారి నెలలు కూడా పడుతుంది. అదంతా పాత కాలం. ఇప్పుడు నడుస్తోంది జెన్ జీల యుగం. మారుతున్న కాలానికి తగ్గట్లుగా.. కొత్త ట్రెండ్ లను సెట్ చేసే క్రమంలో తెర మీదకు వస్తున్న తమాషా బంధాలకు తాజా నిదర్శనం ఈ స్పీడ్ ఫ్రెండింగ్ అలియాస్ ఇన్ స్టెంట్ ఫ్రెండింగ్. ఒంటరితనంతో ఉండాల్సిన అవసరం లేదు. మా ప్రోగ్రాంకు రండి.. అపరిచితులను కలవటం.. మీకు నచ్చినోళ్లను అప్పటికప్పుడు స్నేహం చేసుకునేలా వేదికలు హైదరాబాద్ మహానగరంలో ఈ మధ్యన కొత్త ట్రెండ్ గా మారింది.

ఐటీ కారిడార్ లో జోరు అందుకున్న ఈ తీరు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో అపరిచిత స్నేహాలు సరిపోవన్నట్లుగా కొన్ని సంస్థలు నగరంలోని కొన్ని వేదికల మీద ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఎంట్రీ ఫీజ్ ను రూ.200 నుంచి రూ.వెయ్యి వరకు నిర్ణయిస్తున్నారు. ఆన్ లైన్ లో స్నేహాలు కుదుర్చుకొని.. కొంతకాలం చాటింగ్ చేసుకున్న తర్వాత కలిసే తీరుకు మరింత వేగంగా.. ఆ మాటకు వస్తే.. ఇన్ స్టెంట్ స్నేహాలకు వేదికలుగా ఈ వేడుకలు మారాయి.

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మాదాపూర్.. గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వీకెండ్ లో ఈ తరహా కార్యక్రమాలు ప్రత్యేకంగా సాగుతున్నాయి. ఇలాంటి వేదికల్ని పరిచయం చేయటానికి సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు నిర్వహాకులు. తాజా స్పీడ్ ఫ్రెండింగ్ కాన్సెప్టు విషయానికి వస్తే.. ఇందులో ఎంట్రీ టికెట్ కొనుగోలు చేసి వచ్చేవారిలోని ప్రతి వ్యక్తితోనూ మూడు నుంచి ఐదు నిమిషాల వరకు సమయాన్ని కేటాయిస్తారు. సమయం ముగిసినంతనే టేబుల్ మీద ఉన్న వ్యక్తి మారి.. కొత్త వ్యక్తి వస్తారు. అలా అపరిచితులతో మాట్లాడుకోవటానికి వీలుగా.. మొహమాటం.. బిడియం లాంటివి పోగొట్టేందుకు ఈ తరహా వేదికలు పని చేస్తాయని చెబుతున్నారు.

ఇలా మాటలతో పాటు.. ఆటలు.. ప్రశ్నలు ఇలా కొన్ని కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఎంట్రీ ఫీజుకు అదనంగా ఫుడ్ బిల్ ఉంటుంది. మాటా మాటా కలిసి.. మనసుకు నచ్చితే అప్పటికప్పుడు ఆ అపరిచితులు కాస్తా పరిచయస్తుల మాదిరి.. స్నేహితులు మాదిరి మారిపోవచ్చు. అయితే.. ఈ తరహా వేదికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎదుటి వ్యక్తి ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వారు ఏ ఉద్దేశంతో వచ్చారు? వారేం కోరుకుంటున్నారు? కొత్త స్నేహాలతో సంతోషం తర్వాత.. అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. స్నేహం అన్నది సహజంగా.. కాలంతో పాటు సాగాలే తప్పించి.. ఇన్ స్టెంట్ గా మొదలైతే.. ఆ తర్వాత అదో సమస్యగా మారే ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికి.. ఇలాంటి ట్రెండీ కాన్సెఫ్టులకు ఆదరణ అంతకంతకూ పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు. కొత్త స్నేహాల కోసం డబ్బులు చెల్లించి మరీ వెళ్లాలా? అన్నదో ప్రశ్న. ఇలాంటి చోట్ల పరియమైన వారిని ఇట్టే నమ్మేయొద్దని.. వ్యక్తిగత వివరాల్ని ఎక్కువగా షేర్ చేసుకోవటం ఏ మాత్రం సురక్షితం కాదన్న హెచ్చరిక వినిపిస్తోంది. సో.. బీకేర్ ఫుల్.