లిఫ్ట్ లో వెళ్లే వేళ ఇరుక్కుపోయి మరణించిన ఆరేళ్ల పిల్లాడు
హైదరాబాద్ మహానగరంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు మరణించిన వైనం షాకింగ్ గా మారింది.
By: Garuda Media | 20 Nov 2025 11:28 AM ISTహైదరాబాద్ మహానగరంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు మరణించిన వైనం షాకింగ్ గా మారింది. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న ఈ ఘటనలోకి వెళితే.. అమీర్ పేటకు కాస్త దూరంలో ఉండే ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్ మెంట్ లో ఈ విషాద ఘటన జరిగింది. లిఫ్టు డోర్ తెరిచి లోపలకు వెళ్లే ప్రయత్నంలో ఆరేళ్ల బాలుడు హర్షవర్ధన్ ఇరుక్కుపోవటం.. ప్రాణాలు విడిచాడు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి కీర్తి అపార్టుమెంట్ లోని ఐదో అంతస్తులో ఉంటున్నారు. మరణించిన బాలుడు మధురానగర్ లోని ఒక స్కూల్లో ఎల్ కేజీ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి తల్లి.. అన్నతో కలిసి ఇంటికి వచ్చాడు. ఐదో అంతస్తుకు చేరుకున్న లిఫ్టు తిరిగి కిందకు వెళ్లే వేళలో లిఫ్ట్ డోర్ తెరిచిన సమయంలో ఇరుక్కుపోయాడు.
బాలుడు కేకలు వేయటంతో అపార్టుమెంట్ వాసులు అక్కడకు చేరుకొని.. బాలుడ్ని బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న అతడ్ని.. బంజారాహిల్స్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే బాలుడు మరణించినట్లుగా వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో అపార్టుమెంట్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన గురించి విన్నవారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
