Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ ధనికుల దూకుడు.. దేశ టాప్‌ 100లో ఏడుగురు తెలుగు వ్యాపార దిగ్గజాలు

దేశంలోని సంపన్నుల జాబితాలో హైదరాబాద్‌ మరోసారి తన ప్రత్యేక స్థానాన్ని చాటుకుంది.

By:  A.N.Kumar   |   25 Sept 2026 11:35 AM IST
హైదరాబాద్‌ ధనికుల దూకుడు.. దేశ టాప్‌ 100లో ఏడుగురు తెలుగు వ్యాపార దిగ్గజాలు
X

దేశంలోని సంపన్నుల జాబితాలో హైదరాబాద్‌ మరోసారి తన ప్రత్యేక స్థానాన్ని చాటుకుంది. పరిశ్రమలు, ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డేటా సెంటర్లు వంటి విభిన్న రంగాల్లో వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు వ్యాపార ప్రముఖులు దేశంలోని టాప్‌ 100 సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. హురున్‌ విడుదల చేసిన తాజా సంపద నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఈ ఏడుగురు వ్యాపారవేత్తలు, వారి కుటుంబాల వద్ద కలిపి ఉన్న సంపద విలువ రూ.4,01,200 కోట్లకు పైగా ఉండటం ప్రత్యేకంగా నిలిచింది. ఒకే నగరానికి చెందిన వ్యాపార కుటుంబాలు ఇంత భారీ స్థాయిలో సంపదను కలిగి ఉండటం హైదరాబాద్‌ ఆర్థిక ప్రాధాన్యాన్ని కూడా ప్రతిబింబిస్తోంది.

ఫార్మా నుంచి ఇన్‌ఫ్రా వరకు..

ఈ జాబితాలో హైదరాబాద్‌ నుంచి అత్యధిక సంపద కలిగిన వారిలో దివీస్‌ ల్యాబొరేటరీస్‌కు చెందిన మురళి ముందంజలో ఉన్నారు. ఆయన అంచనా సంపద రూ.1,25,400 కోట్లుగా నమోదైంది. దేశీయ ఫార్మా రంగంలో దివీస్‌ ల్యాబొరేటరీస్‌ విస్తరణ ఆయన సంపద పెరుగుదలలో కీలక పాత్ర పోషించింది.

ఆ తర్వాత మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్) కు చెందిన పి. పిచ్చిరెడ్డి రూ.53,100 కోట్ల సంపదతో, పి.వి. కృష్ణారెడ్డి రూ.52,100 కోట్ల సంపదతో జాబితాలో నిలిచారు. దేశవ్యాప్తంగా భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో మేఘా విస్తరించడంతో ఈ కుటుంబ వ్యాపార సామ్రాజ్యం గణనీయంగా పెరిగింది.

టెక్నాలజీ, ఫార్మా రంగాలకూ స్థానం

హైదరాబాద్‌కు చెందిన కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్‌ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ పిన్నపురెడ్డి, కుటుంబం రూ.46,100 కోట్ల సంపదతో జాబితాలో ఉన్నారు. డిజిటల్‌ మౌలిక వసతులు, క్లౌడ్‌, డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ ఈ రంగానికి ప్రాధాన్యాన్ని పెంచుతోంది.

ఇక ఫార్మా రంగం నుంచి ఆరోబిందో ఫార్మాకు చెందిన పి.వి. రామ్‌ప్రసాద్‌ రెడ్డి రూ.39,900 కోట్ల సంపదతో, హెటెరో గ్రూప్‌కు చెందిన బి. పార్థసారథి రెడ్డి కుటుంబం రూ.39,400 కోట్ల సంపదతో టాప్‌ 100లో చోటు సంపాదించారు.

హైదరాబాద్‌ నాలుగో స్థానంలో..

వ్యక్తిగత సంపదతో పాటు నగరాల వారీగా చూస్తే కూడా హైదరాబాద్‌ సత్తా చాటింది. దేశంలో అత్యధిక సంఖ్యలో సంపన్నులు ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానాన్ని హైదరాబాద్‌ దక్కించుకుంది.

ఈ జాబితాలో దేశవ్యాప్తంగా గౌతమ్‌ అదానీ, ముకేశ్‌ అంబానీ వంటి పారిశ్రామిక దిగ్గజాలు అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే హైదరాబాద్‌ నుంచి ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, టెక్నాలజీ రంగాలకు చెందిన వ్యాపార కుటుంబాలు ఒకేసారి టాప్‌ 100లో కనిపించడం నగర వ్యాపార పరిణామానికి మరో సంకేతంగా నిలుస్తోంది.

హైదరాబాద్‌ కేవలం ఐటీ, స్టార్టప్‌ హబ్‌గానే కాకుండా ఫార్మా, ఇన్‌ఫ్రా, డేటా సెంటర్లు వంటి రంగాల్లో భారీ వ్యాపార సామ్రాజ్యాలను సృష్టిస్తున్న నగరంగా ఎదుగుతున్నట్లు ఈ జాబితా సూచిస్తోంది.