రెండో భార్యను లేపేసేందుకు బిహార్ వెళ్లి పిస్టల్ తెచ్చి ప్రాక్టీస్..కట్ చేస్తే అరెస్టు
ఇటీవల కాలంలో వైవాహిక బంధాలకు సంబంధించి కొన్ని దారుణ ఉదంతాలు బయటకు రావటం తెలిసిందే.
By: Garuda Media | 10 March 2026 11:22 AM ISTఇటీవల కాలంలో వైవాహిక బంధాలకు సంబంధించి కొన్ని దారుణ ఉదంతాలు బయటకు రావటం తెలిసిందే. జీవిత బాఘస్వామి తీరు నచ్చకుంటే చట్టబద్ధంగా విడాకులు తీసుకునే ఆప్షన్ ఉన్నప్పటికి.. అందుకు భిన్నంగా వారి ప్రాణాలు తీసేంత కసి.. కోపం కొందరిలో ఈ మధ్యన ఎక్కువైంది. విడాకుల కంటే.. వారిని అంతం చేసేస్తే.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేద్దామన్న పిచ్చి ప్లాన్లు వేసి.. అడ్డంగా బుక్ అయి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవలోకే చెందుతుంది. అయితే.. హైదరాబాద్ మహానగర పోలీసుల అప్రమత్తత.. పోలీసింగ్ పుణ్యమా అని.. ఒక హత్య త్రుటిలో తప్పింది. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ మహా నగర శివారుకు చెందిన ఒక వ్యాపారి భార్యకు తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతూ ఉండేది. ఆమె కోలుకునే అవకాశం లేని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యుల సూచనతో భార్య సోదరిని రెండో పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో రెండో భార్య తీరుతో ఊహించని మార్పులు రావటాన్ని గమనించాడు. దీంతో అనుమానంతో ఆమె తీరును చూడగా.. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని గుర్తించాడు.
దీంతో ఆమె తన పద్దతిని మార్చుకోవాలని హెచ్చరించాడు. అదే సమయంలో ఆమె తీరుపై బంధువులు.. స్నేహితులకు తెలవటం.. వారు మాట్లాడటంతో తన పరువు పోయినట్లుగా భావించాడు. దీంతో.. రెండో భార్యను.. ఆమె ప్రియుడ్ని చంపాలని డిసైడ్ అయ్యాడు. బిహార్ వెళ్లి దేశవాళీ పిస్తోలు.. బుల్లెట్లు కొనుగోలు చేసి నగరానికి చేరుకున్నాడు. నగర శివారులో జన సంచారానికి దూరంగా ఉండే ప్రాంతాలకు వెళ్లి.. పిస్టల్ కాల్చటంలో ప్రాక్టీస్ చేయటం షురూ చేశాడు. తాను టార్గెట్ చేసిన వారిని అంతమొందించేందుకు సరిపోయే సుపారీ ముఠా కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో పాత నేరస్తుల గురించి ఆరా తీసే క్రమంలో ఈ వ్యాపారి గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఈ వ్యాపారిని అరెస్టు చేశారు. దీంతో.. రెండు హత్యలు త్రుటిలో తప్పినట్లైంది.
