Begin typing your search above and press return to search.

ఎంతో క్షోభను మోసిన తల్లి చివరికి ఇలా చేసింది..

కుటుంబ కలహాలతో జీవితాలు నాశనం కావడమే కాదు.. సమాజంపైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.

By:  Tupaki Political Desk   |   15 Oct 2025 12:34 PM IST
ఎంతో క్షోభను మోసిన తల్లి చివరికి ఇలా చేసింది..
X

కుటుంబ కలహాలతో జీవితాలు నాశనం కావడమే కాదు.. సమాజంపైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. పెద్దల పర్యవేక్షణ లేకపోవడం (న్యూక్లియర్ ఫ్యామిలీస్), సంసారం ఈదేందుకు కావలసిన అనుభవం లేకపోవడంతో దంపతులు చిన్న చిన్న వాటికే ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ జీవనాడి. ఇక్కడి నుంచి మనిషి ఎదుగుదల, నాశనం ప్రారంభమవుతుంది. అందుకే కుటుంబ సమస్యలతో కోర్టులకు వెళ్లే వారి పట్ల న్యాయస్థానాలు సున్నితంగా వ్యవహరిస్తుంటాయి. ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచి వేస్తుంది.

హైదరాబాద్‌ బాలానగర్‌లో సాయిలక్ష్మి ఘటన ప్రతి మనసునూ కుదిపేసింది. ఇది కేవలం ఒక కుటుంబ విషాదం కాదు.. సమాజం తన బాధ్యతను మరచిపోయిందని చెప్పేందుకు సూచన. రెండేళ్ల కవల పిల్లల్లో ఒకరికి మాటలు రావడం లేదని భర్త తరచూ బాధ పెట్టడంతో తల్లి నిరాశ చెంది పిల్లల ప్రాణాలు తీసి, తాను తనువు చాలించుకున్న ఘటన తీవ్రంగా చలించివేసింది.

సాయిలక్ష్మి కథలోని బాధ

సాయిలక్ష్మి (27) సాధారణ యువతి. కుటుంబం అనే చక్రంలోకి వచ్చి ఇద్దరు పండంటి పిల్లలకు జన్మనిచ్చి కుటుంబాన్ని నిర్మించింది. తన కన్న పిల్లల్లో ఒక కుమారుడికి మాటలు రాకపోవడమే ఆమె జీవితాన్ని నరకంగా మార్చింది. భర్త అనిల్‌కుమార్‌ ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, ఆధునిక విద్యావంతుడు. అయినప్పటికీ, తన కుమారుడి జన్యుపరమైన సమస్యను అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేకపోయాడు. అతని ప్రవర్తన శాస్త్రానికీ, మానవత్వానికీ అవమానం. పిల్లలోని లోపాన్ని భార్యపై నెట్టడం ఒక ‘విద్యావంతుడి అజ్ఞానం’గానే చూడాలా?

సాయిలక్ష్మి ఆ బాధను అనేక రాత్రులు మౌనంగా మోసింది. ఆమె తల్లిదండ్రులు కూడా మధ్యవర్తిత్వం చేశారు, కానీ భర్త మనసు మారలేదు. చివరికి ఆమె ‘మారడు’ అన్న వాక్యం వీడియోలో చెప్పినప్పుడు అది ఒక నిస్సహాయ స్త్రీ చివరి మాటగా మిగిలిపోయింది.

దిండుతో హత్య ఆపై ఆత్మహత్య

మంగళవారం (అక్టోబర్ 14) తెల్లవారుజామున సాయిలక్ష్మి ముందుగా తన కవల పిల్లలు కార్తికేయ, లాస్యతవల్లిని దిండుతో ఊపిరాడనివ్వకుండా చంపింది. ఆ తర్వాత భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడిచింది. ఆమె ఫోన్‌లో రికార్డు చేసిన వీడియో ఒక తల్లి గుండె చీల్చే విలాపం. ‘పిల్లలు నాతోనే వచ్చారు.. నాతోనే పోతారు..’ అని చెప్పిన వాక్యం మానసిక ఒత్తిడి ఎంత లోతుగా ఉంటుందో చూపిస్తుంది.

అలాచేయడం కరెక్ట్ కాదు.. ఎన్నో పరిష్కారాలు..

సాయి లక్ష్మి గాథ విన్నవారు ఎవరైనా ఆమె పడిన బాధ వర్ణింపబడేది కాదనడం సబబే.. కానీ సమస్యకు చావే పరిష్కారం కాదు.. సాయి లక్ష్మి ఈ నిర్ణయాన్ని మరోలా తీసుకుంటే ఇద్దరు పిల్లలు అందమైన ప్రపంచాన్ని నిర్మించేవారేమో.. జన్యు సంబంధమైన వ్యాధిని సాకుగా చూపి తనపై నిందలు వేసి వేధించిన భర్త, అత్తమామలకు శిక్ష పడేదోమో. ఈ తరం అమ్మాయిలు పోరాటం నేర్చుకోవాలి. సమస్యలు లేని మనిషి కాదు.. జీవి సైతం లేదు బతకాలంటే పోరాటం తప్పనిసరి. బాధలతో తాను సూసైడ్ చేసుకుంది. పిల్లలు ఏం చేశారని వారిని చంపింది. ఇది కరెక్ట్ కాదన్న వారు చాలా మంది ఉన్నారు. హత్య, ఆత్మహత్యలు ఎప్పుడు పరిష్కారాలు కావు.

ఇది ఒక్క కుటుంబం గాధ కాదు. మన సమాజంలో ఇలాంటి వందలాది సాయిలక్ష్మిలు జీవిస్తున్నారు. తమ బాధను చెప్పుకోలేక, చనిపోవాలనే నిర్ణయం తీసుకుంటున్నారు. మనకు కావలసింది ‘మానసిక అవగాహన’ మాత్రమే కాదు.. భార్యభర్తల మధ్య భావోద్వేగాలను సమంగా చూసే విధానం.. పిల్లల లోపాలను భార్య లేదా భర్త తప్పుగా చూడడం సరికాదు. బాలానగర్‌ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి సాయిలక్ష్మి భర్త అనిల్‌కుమార్‌, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.