Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో బతకడం భారమవుతోందా?

ఒకప్పుడు హైదరాబాద్ అంటే తక్కువ ఖర్చుతో కూడిన మెట్రో నగరం. బెంగళూరు ట్రాఫిక్, ముంబై అద్దెలతో పోలిస్తే ఇక్కడ జీవితం సాఫీగా బడ్జెట్‌లో సాగిపోయేది.

By:  A.N.Kumar   |   10 Feb 2026 1:00 AM IST
హైదరాబాద్ లో బతకడం భారమవుతోందా?
X

ఒకప్పుడు హైదరాబాద్ అంటే తక్కువ ఖర్చుతో కూడిన మెట్రో నగరం. బెంగళూరు ట్రాఫిక్, ముంబై అద్దెలతో పోలిస్తే ఇక్కడ జీవితం సాఫీగా బడ్జెట్‌లో సాగిపోయేది. కానీ గత ఐదేళ్లుగా మారుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ పాత రోజులు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయని స్పష్టమవుతోంది. భాగ్యనగరంలో జీవన వ్యయం మౌనంగా కానీ అంతే వేగంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. ఇది అకస్మాత్తుగా సంభవించిన మార్పు కాదు, నిశ్శబ్దంగా వేళ్లూనుకుంటున్న ఆర్థిక సవాలు.

పెరుగుతున్న ధరల పరుగు

నగరంలో నివాసం ఉండటం ఇప్పుడు ఒక విలాసంగా మారుతోంది. ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో అద్దెలు ఏడాదికి 8–12 శాతం మేర పెరుగుతుండటం ఆందోళనకరం. కేవలం రెంట్లే కాదు, విద్యా రంగంలో ఫీజుల మోత జీతాల పెరుగుదల కంటే రెండింతలు వేగంగా ఉంటోంది. నగర జీవన వ్యయాన్ని నిశితంగా గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన, ఆందోళనకరమైన వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 15-20 వేలతో గడిచిపోయే జీవనం.. ఇప్పుడు పీజీ లేదా షేర్డ్ అకామిడేషన్‌లో కనీసం 28 నుంచి 35 వేల రూపాయలకు చేరుకుంది. ప్రైవసీ కోరుకుంటే ఆ అంకె 60 వేల మార్కును తాకుతోంది. మధ్యతరగతి కుటుంబాలకు హైదరాబాద్ ఇప్పుడు ఖరీదైన చిరునామా. 2 బీహెచ్.కే లో ఉండాలంటే 75-90 వేలు.. ఇక పిల్లల చదువులు, ఇతర అవసరాలు కలిపితే నెలకు కనీసం 1.1 లక్షల రూపాయలు ఉంటే తప్ప 'కంఫర్టబుల్' అనిపించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

గ్యాప్ తగ్గుతోంది.. జాగ్రత్త!

నిజమే ఇప్పటికీ ముంబై లేదా ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ కొంత నయమే అనిపించవచ్చు. కానీ ఆ వ్యత్యాసం అత్యంత వేగంగా తగ్గిపోతుండటమే అసలు సమస్య. ఐటీ హబ్‌లలో ధరలు ఆకాశాన్నంటుతుంటే కూకట్‌పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాలు కొంత మేర ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ అక్కడ కూడా డిమాండ్‌కు తగ్గట్టుగా ధరలు పెరిగిపోతున్నాయి.

ప్లానింగ్ తప్పనిసరి

2026 నాటి హైదరాబాద్‌లో జీవించడం అంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదు.. ఆ సంపాదనను వ్యూహాత్మకంగా ఖర్చు చేయడం. కేవలం "హైదరాబాద్ చౌక నగరం" అనే పాత నమ్మకంతో ఇక్కడ అడుగుపెడితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. సరైన లొకేషన్ ఎంపిక, కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ, ముందస్తు పొదుపు ఉన్నప్పుడే ఈ మారుతున్న మెట్రోలో ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుంది. భాగ్యనగరం తన రూపురేఖలను మార్చుకుంటోంది.. ఆ మార్పు మన జేబుపై చూపే ప్రభావాన్ని గుర్తించి అప్రమత్తమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.