రికార్డు స్థాయిలో చలి.. ఏడేళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు
నగరం అంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం 4 గంటలకే నగరంలో చలి ప్రారంభం అవుతోంది. ఉదయం 10 గంటల వరకు శీతల గాలులే వీస్తున్నాయి.
By: Tupaki Political Desk | 12 Dec 2025 8:00 PM ISTతెలంగాణతోపాటు హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరిగింది. ఈ శీతాకాలం ఆరంభం నుంచి రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలే నమోదు అవుతున్నాయి. ఇక శుక్రవారం ఉదయం హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ లోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల పది సెల్సియస్ డిగ్రీలు కంటే తక్కువగా రికార్డు అయ్యాయి. కొన్నిచోట్ల 6 నుంచి 9 డిగ్రీల మధ్యే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. హిల్ స్టేషన్లు, అటవీ ప్రాంతాల్లో ఉండే విధంగా హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
గత ఏడేళ్లలో ఎన్నడూ లేనట్లు హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయని అంటున్నారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలోని శేరిలింగపల్లి, హెచ్సీయూ, సెంట్రల్ వర్సిటీ ప్రాంతాల్లో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అదేవిధంగా గచ్చిభౌలిలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నగరం నడిబొడ్డున ఉన్న గచ్చిబౌలిలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా మొహిదీపట్నంలో సైతం 11.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నగరం అంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం 4 గంటలకే నగరంలో చలి ప్రారంభం అవుతోంది. ఉదయం 10 గంటల వరకు శీతల గాలులే వీస్తున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు కాస్త పొడి వాతావరణం ఉంటోంది. దీంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీత గాలులతోపాటు మంచు విపరీతంగా కురుస్తుండటం వల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలు తున్నాయని అంటున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ శీతాకాలం ప్రారంభం నుంచి రాష్ట్రంలో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలే ఉంటున్నాయి. దీంతో చలి ప్రభావం ఎక్కువైందని చెబుతున్నారు. శీతల గాలులకు పొగమంచు తోడవడంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం చూస్తే మన్యంలో మరింత ఘోరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
