‘మీ నాన్ననే పోలీసులతో ఎన్ కౌంటర్ చేయించా’.. హత్య వెనుక వార్నింగ్
అంతేకాదు హత్యకేసులో ప్రధాన నిందితుడు చందన్ సింగ్ కొన్నేళ్ల క్రితం కుస్తీ క్రీడాకారుడన్న విషయాన్ని పోలీసుల విచారణలో గుర్తించినట్లుగా తెలుస్తోంది.
By: Garuda Media | 10 Dec 2025 4:00 PM ISTపిల్లల్ని స్కూలు వద్ద దింపి వస్తున్న రియల్టర్ వెంకటరత్నంను అందరూ చూస్తుండగా.. అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం హైదరాబాద్ మహానగర శివారు జవహర్ నగర్ లో జరగటం.. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ హత్య వెనుక రెండేళ్ల క్రితం ఎదురైన వార్నింగ్ కూడా కారణమన్న విషయం తాజాగా వెలుగు చూసింది. అంతేకాదు హత్యకేసులో ప్రధాన నిందితుడు చందన్ సింగ్ కొన్నేళ్ల క్రితం కుస్తీ క్రీడాకారుడన్న విషయాన్ని పోలీసుల విచారణలో గుర్తించినట్లుగా తెలుస్తోంది.
రెండేళ్ల క్రితం ఒక భూమి వ్యవహారం.. బ్యాంక్ లోన్ ఇష్యూలో హత్యకు గురైన వెంకటరత్నం.. చంపిన చందన్ సింగ్ మధ్య ఉన్న పంచాయితీనే హత్య వరకు వెళ్లేలా చేసినట్లుగా చెబుతున్నారు. ఈ భూమి ఇష్యూలోనే తన తండ్రి మరణానికి ప్రధాన కారణం వెంకటరత్నమే ప్రధాన కారణంగా తెలుసుకున్న చందన్ సింగ్ అప్పటి నుంచి మరింత కక్షతో రగిలిపోయాడు. మూడు నెలలు రెక్కీ చేసి స్నేహితులతో కలిసి వెంకటరత్నాన్ని హత్య చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ప్రస్తుతం రియల్టర్ గా పేరున్న వెంకటరత్నం కొన్ని దశాబ్దాల క్్రతం నగరానికి వచ్చాడు. పాతబస్తీకి చెందిన రౌడీషీటర్ సుదేశ్ సింగ్ కు ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. అతడి ఎన్ కౌంటర్ తర్వాత వెంకటరత్నం రియల్ ఎస్టేట్ చేశాడు. రెండేళ్ల క్రితం ఒక భూమికి సంబంధించిన బ్యాంక్ లోన్ విషయంలో వెంకటరత్నం అనుచరులకు.. గోషామహల్ కు చెందిన కొందరితో పంచాయితీ చోటు చేసుకుంది. అందులో చందన్ సింగ్ ఒకడు.
ఈ ల్యాండ్ ఇష్యూ గురించి వెంకటరత్నం ఫోన్ చేసి చందన్ సింగ్ తో మాట్లాడాడు. మాటల్లో ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఈ సందర్భంగా చందన్ సింగ్ తండ్రి సుదేశ్ సింగ్ ఎన్ కౌంటర్ కు సమాచారం తానే ఇచ్చానని చెబుతూ.. ‘మీ నాన్ననే ఎన్ కౌంటర్ చేయించా. నీకూ అదే పరిస్థితి వస్తుంది’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వెంకటరత్నం బ్యాక్ గ్రౌండ్ గురించి.. తన తండ్రితో అతడికున్న సంబంధం గురించి ఆరా తీయటం ద్వారా మరింత ఆగ్రహానికి గురైనట్లుగా తెలుస్తోంది.
వెంకటరత్నం తనను చంపటానికి ముందే తానే అతడ్ని చంపేస్తే సరిపోతుందని ఆర్నెల్ల క్రితం ప్లాన్ చేశాడు. మూడు నెలలుగా స్నేహితులతో కలిసి జవహర్ నగర్ లోని వివిధ ప్రాంతాల్లో రెక్కీ చేసి.. చివరకు హత్య చేశాడు. చందన్ సింగ్ కుస్తీ క్రీడాకారుడిగా మంచి పేరున్నా.. తర్వాతి కాలంలో ఉపాధి అవకాశాలు లేకపోవటంతో సొంతంగా ఆటోగ్యారేజ్ నడిపిస్తున్నాడని.. హత్యలో అతనితో పాటు ఉన్న వారంతా అతని స్నేహితులుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా పోలీసులు విచారిస్తున్నారు.
