Begin typing your search above and press return to search.

హైదరాబాద్ 'రియల్' వాస్తవాన్ని కళ్లకు కట్టిన హైడ్రా రంగనాథ్

ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటమే మంచిదనే ఆలోచనకు కొంతమంది ప్రజలు మారుతున్నారని కూడా రంగనాథ్ పేర్కొన్నారు.

By:  A.N.Kumar   |   17 Sept 2026 7:53 AM IST
హైదరాబాద్ రియల్ వాస్తవాన్ని కళ్లకు కట్టిన హైడ్రా రంగనాథ్
X

హైదరాబాద్.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఐటీ రంగం.. ఇలా అన్ని రంగాల్లో నగరం దూసుకుపోతోంది. కానీ అదే సమయంలో సామాన్యుడికి మాత్రం హైదరాబాద్‌లో సొంతిల్లు అనేది రోజురోజుకూ అందని కలగా మారుతోంది. ఒకప్పుడు కష్టపడి పనిచేస్తే నగరంలో ఓ చిన్న స్థలం కొనుగోలు చేయవచ్చనే నమ్మకం ఉండేది. ఇప్పుడు మాత్రం చదువుకున్న ఉద్యోగి కూడా తన జీతంతో ఓ ప్లాట్ లేదా ఇల్లు కొనాలంటే జీవితకాలం ఊడిగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ సాగుతోంది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రియల్ ఎస్టేట్ ధరలను వ్యాపారులు, పెట్టుబడిదారులు తమ లాభాల కోసం ఇష్టానుసారంగా పెంచడం వల్ల సామాన్యులు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల దూరమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒక కార్యక్రమంలో మాట్లాడిన రంగనాథ్.. ప్రజలు కొనలేని స్థలం లేదా ఇంటికి కోట్ల రూపాయల ధర నిర్ణయించడం వల్ల చివరకు మార్కెట్‌కే నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మార్కెట్‌లో వాస్తవమైన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ధరలు నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కోటి జీతం కాదు.. లక్ష జీతమే ఉన్న ఉద్యోగి పరిస్థితి ఏంటి?

నెలకు లక్ష రూపాయల జీతం వచ్చే సగటు ఉద్యోగి హైదరాబాద్‌లో ఒక ప్లాట్ లేదా ఇల్లు కొనాలంటే ఎంతకాలం పనిచేయాలి? అనే ప్రశ్నను రంగనాథ్ ప్రస్తావించారు. భారీ ధరల కారణంగా ఒక సాధారణ ఉద్యోగి తన జీవితకాల ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు లేదా పెట్టుబడిదారులకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో చదరపు అడుగు ధరలు భారీ స్థాయికి చేరుకున్నాయని, అలాంటి ధరలకు సామాన్యులు ఇళ్లు ఎలా కొనుగోలు చేయగలరని ప్రశ్నించారు. ధరలు ప్రజల కొనుగోలు శక్తికి అందకుండా పోతే సహజంగానే కొనుగోలుదారులు మార్కెట్‌కు దూరమవుతారని తెలిపారు.

ధర పెంచితే విలువ పెరిగినట్టేనా?

రంగనాథ్ వ్యాఖ్యల్లో ప్రధానంగా వినిపించిన అంశం ఇదే. ఒక భూమిని రూ.200 కోట్లకు కొనుగోలు చేసి.. ఆ పెట్టుబడిని తిరిగి పొందేందుకు ప్రతి ఫ్లాట్‌కు భారీ ధర నిర్ణయిస్తే.. ఆ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. కాగితంపై ఉన్న ధర, వాస్తవ మార్కెట్ విలువ రెండూ ఒకటే కాదనే విషయాన్ని రియల్ ఎస్టేట్ రంగం గుర్తించాలని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఒక ప్రాంతంలో ధరలు పెరుగుతున్నాయనే కారణంతో భవిష్యత్తులో పదేళ్లు.. ఇరవై ఏళ్ల తర్వాత ఉండే ధరలను ఇప్పుడే అమలు చేస్తే.. అది మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని రంగనాథ్ అభిప్రాయపడ్డారు.

అద్దె ఇళ్లే మేలు అంటున్న మధ్యతరగతి

ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటమే మంచిదనే ఆలోచనకు కొంతమంది ప్రజలు మారుతున్నారని కూడా రంగనాథ్ పేర్కొన్నారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు.. నగరంలోని మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే విషయంగా మారుతోంది. సొంతింటి కోసం సంవత్సరాల తరబడి పొదుపు చేసిన కుటుంబానికి కూడా తాము కోరుకున్న ప్రాంతంలో ఇల్లు కొనడం సాధ్యం కాకపోతే.. చివరకు అద్దె ఇంటినే ఆశ్రయించాల్సి వస్తోంది. తల్లిదండ్రులు జీవితాంతం కూడబెట్టిన పొదుపు, పిల్లల చదువులు, ఉద్యోగం, భవిష్యత్ అవసరాలు అన్నింటినీ పక్కనపెట్టి ఇల్లు కోసం భారీ రుణభారం తీసుకోవడం కూడా ప్రతి కుటుంబానికి సాధ్యం కాదు.

రియల్ ఎస్టేట్‌కు అసలు పరీక్ష ఇదే..

భూమి ధర ఎంత పెరిగిందనేది కాకుండా.. ఆ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా? అనేదే అసలు ప్రశ్న. కొనుగోలుదారుడి సామర్థ్యాన్ని మించి ధరలు పెరిగితే.. ఆ మార్కెట్‌లో లావాదేవీలు తగ్గే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ వంటి నగరంలో అభివృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు పెరగడం సహజంగానే భూములపై డిమాండ్‌ను పెంచవచ్చు. అయితే ఆ డిమాండ్‌ను మించి ధరలు పెరిగితే పరిస్థితి ఎలా మారుతుంది? అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

సొంతింటి కల ప్రతి మధ్యతరగతి కుటుంబానికీ ఒక భావోద్వేగం. కానీ ఆ కలకు ధర కోట్ల రూపాయలుగా మారితే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై తాజాగా వినిపిస్తున్న ఈ ప్రశ్నకు మార్కెట్ భవిష్యత్తులో ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.