Begin typing your search above and press return to search.

వరుస మరణాలు.. హైదరాబాద్ ప్రొఫెసర్ మృతి.. ఐఐటీ ఖరగ్ పూర్ లో ఏం జరుగుతోంది?

హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రెడ్డి పుల్లగురం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం క్యాంపస్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళనను రేకెత్తించింది.

By:  A.N.Kumar   |   30 July 2026 10:47 AM IST
వరుస మరణాలు.. హైదరాబాద్ ప్రొఫెసర్ మృతి.. ఐఐటీ ఖరగ్ పూర్ లో ఏం జరుగుతోంది?
X

పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రెడ్డి పుల్లగురం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం క్యాంపస్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళనను రేకెత్తించింది. గత కొన్ని నెలల వ్యవధిలోనే ఒకే క్యాంపస్‌లో సంభవించిన మూడో మరణం కావడంతో ఈ ఘటన స్థానికంగానూ విద్యా వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

డాక్టర్ దీపక్ రెడ్డి పుల్లగురం ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2022 సెప్టెంబర్‌లో ఆయన ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. విద్యార్థులకు సులభమైన రీతిలో బోధించడం, నాణ్యమైన పరిశోధనలు చేయడంలో ఆయన మంచి గుర్తింపు పొందారు. క్యాంపస్‌లో ఇన్‌స్టిట్యూట్ కేటాయించిన స్టాఫ్ క్వార్టర్స్‌లోనే ఆయన ఒంటరిగా నివాసముంటున్నారు.

బుధవారం ఉదయం సహచర అధ్యాపకులు ఆయనకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో అనుమానం వ్యక్తమైంది. వెంటనే సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఆయన క్వార్టర్స్‌కు వెళ్లి పరిశీలించారు. తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా ఆయన ఉరివేసుకుని కనిపించారు. వెంటనే ఆయన్ను క్యాంపస్ ఆవరణలోని డాక్టర్ బి.సి. రాయ్ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పోలీసుల దర్యాప్తు.. కుటుంబానికి సమాచారం

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? వ్యక్తిగత లేదా కుటుంబపరమైన సమస్యలా, లేక వృత్తిపరమైన ఒత్తిడులా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. విషాద వార్తను వెంటనే హైదరాబాద్‌లోని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. "పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు స్పష్టమవుతాయి. ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని పోలీసు అధికారులు తెలిపారు.

వర్సిటీలో భయాందోళనలు.. వరుసగా మూడో ఘటన

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో ఇలాంటి ఘోర ఘటనలు జరగడం ఇది మూడోసారి. గతంలో ఇద్దరు విద్యార్థులు వేర్వేరు ఘటనల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకరు హాస్టల్ భవనం పై నుంచి దూకి ప్రాణాలు తీసుకోగా మరొకరు తన గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇప్పుడు ఏకంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ప్రాణాలు కోల్పోవడంతో క్యాంపస్‌లో మానసిక ఆరోగ్యం, తీవ్రమైన పని ఒత్తిడి, భద్రతా ప్రమాణాలపై మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభావంతుడైన అధ్యాపకుడిని కోల్పోవడంపై విద్యార్థులు, సహచర ప్రొఫెసర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.